PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
PM Modi Visit to Amaravati | ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఏపీకి రానున్నారు. రాజధాని అమరాతి పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

అమరావతి: మే 2 న జరిగే ప్రధాని మోదీ అమరావతి పర్యటన లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు అయ్యింది. దానికి బదులుగా కారులో ఉండే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ వెలగపూడి సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనికోసం కనీవినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇటీవల కాశ్మీర్ లో జరిగిన సంఘటనల దృష్ట్యా ప్రధాని పర్యటనకు భద్రతను మరింత పెంచుతున్నారు. అందులో భాగంగానే అమరావతిలో ప్రధాని రోడ్ షో ను రద్దు చేశారు.
ప్రధాని పర్యటన సాగేది ఇలా..
మే నెల 2 వ తేదీన పీఎం మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం గన్నవరం నుండి అమరావతికి వచ్చి 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవాలి. కానీ ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం ప్రజలకు కారులో నుండే అభివాదం చేసుకుంటూ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ సభ జరుగుతుంది.
సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. E 11,E13,E 15 రోడ్లతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయి. ఇప్పటికే పోలీస్ శాఖ రోడ్లు పరిశీలించి గుంతలు పూడ్చాలని సూచించింది.. ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుచేస్తున్నారు.మొత్తం 8 రోడ్ల ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు.
మంగళగిరి నుంచి రెండు రోడ్లు. తాడేపల్లి నుంచి ఒకటి,వెస్ట్ బైపాస్ నుంచి ఒకటి, ప్రకాశం బ్యారేజి నుంచి రెండు, తాడికొండ నుంచి ఒకటి, హరిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ తెలిపింది. పోలీస్ శాఖ సూచనల మేరకు రెండు రోజుల్లోగా రోడ్లన్ని సరిచేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ స్వల్ప మార్పులు మినహా ప్రధాని మోదీ అమరావతి పర్యటన లో ఎలాంటి చేంజెస్ ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.




















