IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..
India vs Australia T20: ట్రోఫీని అందుకున్న వెంటనే స్కై , గతంలో భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు.
Surya kumar Yadav News: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. అయితే ట్రోఫీని అందుకున్న వెంటనే స్కై , గతంలో భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు. దీంతో ట్రోఫీని అందుకున్న ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్ ఎవరైనా ఈ ట్రెడిషన్ కొనసాగుతూనే ఉంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా వచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు.
అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1తో యువ భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో మరోసారి టాస్ గెలిచిన కంగారులు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. నాలుగు ఓవర్లలో 33 పరుగులు జోడించారు. కానీ 15 బంతుల్లో 1 ఫోరు, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసి యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. అదే 33 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి రుతురాజ్ గైక్వాడ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూసింగ్ లు త్వరగా వెనుదిరగడంతో 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కానీ శ్రేయస్స్ అయ్యర్ టీమిండియాను ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగుల చేసి రాణించాడు. జితేశ్ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సుతో 24 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. మొత్తానికి టీమిండియా 160 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు పర్వాలేదనిపించే లక్ష్యాన్ని
ఉంచింది.
అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కలేదు. 22 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్ కోల్పోయారు. కానీ ట్రావిస్ హెడ్ మరోసారి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 28 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ అవుటయ్యాడు. మెక్ డార్మెట్ కూడా 36 బంతుల్లో అయిదు ఫోర్లతో 54 పరుగులు చేసి డార్మెట్ అవుటయ్యాడు. టిమ్ డేవిడ్ 17, షార్ట్ 16 పరుగులతో పర్వాలేదనిపించడంతో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనించినట్టు కనిపించింది. చివరి 11 బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ మాథ్యూ వేడ్ క్రీజులో ఉండడంతో ఆస్ట్రేలియా గెలుపుపై ధీమాగానే ఉంది. కానీ వేడ్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేసి కంగారుల ఆశలపై నీళ్లు చల్లాడు. గత మ్యాచ్‌లో రెండు ఓవర్లు 41 పరుగులను కాపాడుకోలేకపోయిన భారత బౌలర్లు ఈసారి మాత్రం 17 పరుగులను కాపాడుకున్నారు.