Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్ చేసిందెవరు? క్లూస్ టీమ్‌లో హీరో ఏం చేశాడు?
Atharva Review In Telugu: కార్తీక్ రాజు హీరోగా నటించిన సినిమా 'అథర్వ'. క్లూస్, ఫోరెన్సిక్ టీమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఎలా ఉంది? ఏమైంది?
మహేష్ రెడ్డి
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, కబీర్ సింగ్ తదితరులు
సినిమా రివ్యూ: అథర్వ
రేటింగ్: 2.5/5
నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్, విజయ్ రామ రాజు, గగన్ విహారి, శివ కుమార్ తదితరులు
ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత: సుభాష్ నూతలపాటి
రచన, దర్శకత్వం: మహేష్ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
Atharva movie review in Telugu: మర్డర్ మిస్టరీలు తెలుగులో కొన్ని వచ్చాయి. అయితే... క్లూస్, ఫోరెన్సిక్ టీంలో ఉద్యోగం చేసే హీరో కేస్ సాల్వ్ చేయడం కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఆ లెక్కన ఇదొక ప్రయోగాత్మక సినిమా. కార్తీక్ రాజు హీరోగా, ఆయనకు జోడీగా సిమ్రాన్ చౌదరి నటించిన చిత్రమిది. ఎలా ఉంది?
కథ (Atharva Movie Story): కర్ణ... అలియాస్ దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు)కు పోలీస్ కావాలని కోరిక. రెండు మూడుసార్లు ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఉద్యోగం రాదు. ఊరిలో కానిస్టేబుల్ ఇచ్చిన సలహాతో క్లూస్ టీమ్ సెలక్షన్స్‌కు పరీక్ష రాసి సెలెక్ట్ అవుతాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత క్రైమ్ రిపోర్టర్ నిత్య (సిమ్రాన్ చౌదరి)తో పరిచయం అవుతుంది. ఆమె ఎవరో కాదు... కాలేజీలో తాను ప్రేమించిన, ప్రపోజ్ చేయలేకపోయిన జూనియర్. నిత్య ద్వారా హీరోయిన్ జోష్ని (ఐరా) పరిచయం అవుతుంది. ఓ రోజు ఆమె ఇంటికి కర్ణ, నిత్య వెళతారు. జోష్ని, ఆమె బాయ్‌ఫ్రెండ్ శివ రక్తపు మడుగులో పడి ఉంటారు. జోష్నిని శివ చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలుతుంది. కేసు క్లోజ్ అవుతుంది. అయితే... జోష్ని, శివకు సన్నిహితురాలైన నిత్య చెప్పిన కొన్ని సంఘటనలు విన్న కర్ణ... జోష్నిని చంపింది శివ కాదని, వాళ్లిద్దర్నీ మరొకరు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే... కేసును ఇన్వెస్టిగేట్ చేసే అధికారం గానీ, ఉన్నతాధికారుల నుంచి మద్దతు గానీ అతడికి లభించదు. పైగా, సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నిజంగా జోష్నిని శివ హత్య చేశాడా? లేదా వాళ్లిద్దర్నీ మరొకరు చంపారా? ఈ కేసులో నిజానిజాలు ఏమిటి? తన తెలివితేటలతో కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Atharva Telugu Movie Review): మర్డర్ మిస్టరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అయితే... క్లూస్ టీమ్‌లో మెంబర్ కేసును సాల్వ్ చేయడం 'అథర్వ'లో కొత్త పాయింట్. దర్శకుడు మహేష్ రెడ్డి ఎంపిక చేసుకున్న నేపథ్యం కొత్తగా ఉంది. కానీ, ఆ పాయింట్‌కు వెళ్లే వరకు రెగ్యులర్ రొటీన్ ప్యాట్రన్‌లో వెళ్లారు. కథలో ఆసక్తి మొదలు కావడానికి కొంత టైమ్ పడుతుంది. సినిమా ప్రారంభంలో హీరో పరిచయం గానీ, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గానీ కొత్తగా లేదు. సోసోగా వెళతాయి. నగరాలు ఏర్పడక ముందు అన్నీ పల్లెటూరులే, అందరూ ఊరోళ్లే అంటూ హీరో చెప్పే డైలాగ్ కథలో భాగంగా లేదు. ఫోర్స్డ్‌గా ఉంది. హీరోయిన్ మర్డర్ తర్వాత ఒక్కసారిగా కథలో వేగం పెరుగుతుంది.
'అథర్వ'లో ఇంటర్వెల్ తర్వాత క్యూరియాసిటీ, కథలో కాన్‌ఫ్లిక్స్ వచ్చాయి. కేసును సాల్వ్ చేసే క్రమంలో హీరోకు ఎదురయ్యే పరిస్థితులు తర్వాత ఏం జరుగుతుంది? అని చిన్న ఆసక్తి కలిగిస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అనుకోని ముప్పులు ఎలా వస్తాయి? వాళ్ల డ్రస్ ఛేంజింగ్ వీడియోలు ఎలా లీక్ అవుతాయి? ఎలా షూట్ చేస్తారు? వంటివి డీటెయిల్డ్‌గా రీసెర్చ్ చేసి తీశారు.
క్లూస్ టీంలో పని చేసిన అనుభవంతో హీరో చేసే పనులు ఆసక్తి కలిగిస్తాయి. ఇదొక సింపుల్ కథ. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసిన కథ. కానీ, లాజిక్కులు గాలికి వదిలేశారు. హీరోయిన్ మరణించిన తర్వాత పోలీసులు కేసు క్లోజ్ చేయడం తప్ప ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వరు. మినిమమ్ డీటెయిల్స్ కూడా పట్టించుకోరా? అనిపిస్తుంది. అదే సమయంలో చదవు రాని వాళ్లతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి కొందరు క్రైమ్స్ ఎలా చేస్తున్నారనేది డీటెయిల్డ్‌గా చూపించారు. కొన్ని కొన్ని అంశాలను దర్శకుడు బాగా డీల్ చేశారు. మరికొన్ని అంశాల్లో పైపైన వెళుతా సరిగా రీసెర్చ్ చేయలేదనిపిస్తుంది.
'అథర్వ' చిన్న సినిమా అయినప్పటికీ... శ్రీచరణ్ పాకాల చక్కటి నేపథ్య సంగీతం అందించారు. అయితే... గుర్తుంచుకునే పాటలు లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కెమెరా వర్క్ సినిమా స్థాయికి తగ్గట్లు ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ పర్వాలేదు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది.
నటీనటులు ఎలా చేశారంటే: కర్ణ పాత్రకు కార్తీక్ రాజు న్యాయం చేశారు. ఇటువంటి క్యారెక్టర్లలో హీరోయిజం చూపించే అవకాశం ఉండదు. థ్రిల్లర్స్‌లో స్క్రీన్ ప్లే హైలైట్ అవుతుంది కనుక హీరో సైతం కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తారు. అందువల్ల, సన్నివేశానికి ఎంత కావాలో అంత చేశారు కార్తీక్ రాజు. అవకాశం ఉన్న చోట డైలాగ్ డెలివరీతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ ఫైట్ బాగా చేశారు. సిమ్రాన్ చౌదరి పాత్ర పరిధి తక్కువే. ఉన్నంతలో బాగా చేశారు.
Also Read: యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
స్టార్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ చేసిన కబీర్ సింగ్... సినిమా చివర్లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు. జోష్నిగా ఐరా ఓకే. ఆమె బాయ్‌ఫ్రెండ్ పాత్రలో శివ ఆకట్టుకుంటారు. గగన్ విహారి స్టయిలిష్‌గా కనిపించారు. అరవింద్ కృష్ణ పాత్ర మీద అనుమానం కలిగేలా ఆయన పాత్ర ఉంటుంది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాలో 'సరోజ... వద్దమ్మా సరోజ' కామెడీ సీన్ గుర్తుందా? ఆ పెయిర్ ఇందులోనూ ఉన్నారు. ఓ సీన్ చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
చివరగా చెప్పేది ఏంటంటే: 'అథర్వ'లో కాన్సెప్ట్ బావుంది. కానీ, స్టార్టింగ్ బాలేదు. అసలు కాన్సెప్ట్ / కథ మొదలైన అసక్తిగా సాగింది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, టర్న్‌లు ఎంటర్‌టైన్ చేస్తాయి.
Also Read : దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?