Sravanthi Ravi Kishore : నిర్మాతకు లక్ష, దర్శకుడికి లక్ష - ఉత్తమ చిత్రంగా 'స్రవంతి' రవికిశోర్ 'కిడ'
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'కు మరో గౌరవం లభించింది.
చిత్రసీమలో అభిరుచితో సినిమాలు తీసే నిర్మాతలు కొందరు అయితే, సినిమాను వ్యాపార కోణంలో చూసేవారు మరికొందరు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరినీ తప్పు పట్టకూడదు. అభిరుచితో సినిమాలు నిర్మించే వాళ్ళకు అవార్డులు తోడు అయితే? ఆ ఆనందం మరో స్థాయిలో ఉంటుంది. అవార్డుకు రివార్డు తోడు అయితే? ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అటువంటి సంతోషంలోనే 'స్రవంతి' రవి కిశోర్ ఉన్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవి కిశోర్ (Sravanthi Ravi Kishore) నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ' (Kida Movie). ఈ ఏడాది గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ 2022)లో ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మరో అరుదైన గౌరవం ఈ సినిమా సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రంగా 'కిడ'
ప్రతి ఏడాది చెన్నైలో ఆ నగరం పేరు మీద అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. అందులో ఉత్తమ చిత్రంగా 'కిడ' నిలిచింది. పురస్కారంతో పాటు నగదు బహుమతిని కూడా దర్శక - నిర్మాతలకు చిత్రోత్సవాల నిర్వహకులు అందజేశారు.
నిర్మాత 'స్రవంతి' రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్... ఇద్దరికీ అవార్డుతో పాటు రివార్డుగా చెరొక లక్ష రూపాయలను 20వ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇచ్చారు. అంతే కాదు... ఈ సినిమాలో నటించిన పూ రాము (Poo Ramu) కి ఉత్తమ నటుడిగా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకున్నారు.
శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ చైతన్య సమర్పణలో 'కిడ' చిత్రాన్ని 'స్రవంతి' రవి కిశోర్ నిర్మించారు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి ప్రధాన తారాగణం. తమిళనాడు గ్రామీణ నేపథ్యంలో 'కిడ' సినిమా రూపొందింది. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు... ఇలా చాలా మందికి తొలి చిత్రమిది. తమిళులకు దీపావళి పెద్ద పండగ. పటాసులు కాల్చడంతో పాటు ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఆ నేపథ్యంలో కథ సాగుతుందని తెలిసింది.
'కిడ'కు ఉత్తమ చిత్రంగా పురస్కారం లభించిన సందర్భంగా చిత్ర నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''గోవాలో జరిగిన ఇఫీలోని పనోరమాలో 'కిడ'ను ప్రదర్శించిన్నప్పుడు... థియేటర్లో ప్రేక్షకులు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. అక్కడ స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతకు మించిన ఆదరణ లభించింది. ఉత్తమ చిత్రంగా 'కిడ' నిలిచింది. ఇది నాకు, మా చిత్ర బృందానికి ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం : కె.బి. నందు, తమిళ సాహిత్యం : ఏకదేసి, కూర్పు : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, ఛాయాగ్రహణం : ఎం. జయప్రకాశ్.
Also Read : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్