CJI Uday Umesh Lalit: హనుమంత వాహనాన్ని మోసిన సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
CJI Uday Umesh Lalit: సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ శ్రీవారి సేవలో తరించారు. సతీసమేతంగా వాహన సేవ చేశారు.

CJI Uday Umesh Lalit: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరో రోజు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం హనుమంత వాహనంపై స్వామి వారు విహరించి భక్తులకు కనువిందు చేశారు. హనుమంత వాహనంపై ఆశీనులైన స్వామి వారి వాహన సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పాల్గొని స్వయంగా వాహన సేవను మోశారు. అనంతరం వాహనం సేవతో పాటుగా తిరుమాఢ వీధిలో ఉదయ్ ఉమేష్ లలిత్ సతీ సమేతంగా కళాకారులతో కలిసి నాట్యం ఆడి ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వరహా స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న తర్వాత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు సీజే
అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె. మిశ్రా కూడా ఉన్నారు. దర్శనం అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ ను సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ సతీ సమేతంగా బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
సాయంత్రం స్వర్ణరథం, గజవాహనం
ఆరో రోజు అయిన ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శ్రీవారు స్వర్ణ రథంపై భక్తులను కటాక్షించనున్నారు. స్వర్ణ రథం స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణ కట్ట సేవా పరులు తొలుతబంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా వాసులకు ఎంతో సంతోషం కలిగింది. స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుందని విశ్వాసం. ఈ సేవ అనంతరం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగుతూ భక్తులతకు అభయం ఇస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ వాహన సేవలోని ఆంతర్యమని పండితులు చెబుతున్నారు.
నిన్న శ్రీవారి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ఐదో రోజు శ్రీమలయప్పస్వామి వారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్త కోటికి దర్శనం ఇచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళ్తుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శన మధ్య వాహన సేవ కోలాహలంగా సాగింది. మొత్తం గ్యాలరీల వద్ద స్వామి వారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు గరుడ వాహనాదీశుడైన శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

