Jagan Cases : జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టుకు రఘురామ - పిటిషన్‌లో సంచలన విషయాలు !
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.
Jagan Cases : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతోంది. అయితే విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. చార్జిషీట్లు దాఖలు చేసి పదేళ్లు అయినా ఇప్పటికీ ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కిందికోర్టు కొట్టి వేస్తే పై కోర్టుకు వెళ్తున్నారు. ఇలా టైం కరిగిపోతోంది. ఈ కేసుల విచారణలు ఆలస్యమవుతున్నాయని.. వేరే రాష్ట్రానికి తరలించాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన అభియోగాల కేసుల్ని ఏడాదిలోగా తేల్చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందు కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం చొరవ తీసుకున్నారు. కానీ తర్వాత మళ్లీ మమూలు పరిస్థితి చేరింది. గతంలో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో జరిగేది. ఈ మధ్య కాలంలో అలా కూడా జరగడం లేదు. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో విచారణ ఆగిపోయింది. ఆ తర్వాత మరింత నెమ్మదిగా విచారణ సాగుతోంది. ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లో జగన్ అక్రమాస్తుల కేసు హైలెట్ అవుతోంది. చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఎలా ఉన్నారని.. ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నరని టీడీపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని హైదరాబాద్ లో విచారణ అయితే సాగదని భావించి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. నిజానికి రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ. కానీ ఆయన పార్టీకి రెబల్ అయ్యారు. ఓ సందర్భంలో ఆయనపై రాజద్రోహం కేసు కూడా పెట్టి రాత్రికి రాత్రి అరెస్టు చేసి సీఐడీ అధికారులు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆయన ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమయ్యారు. ఆయనపై అనర్హతా వేటు వేయించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పార్టీ ఫిరాయించలేదు. ఈ కారణంగావేటు పడలేదు. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. దీంతో అధికారికంగా వైసీపీ ఎపీగానే కొనసాగుతున్నారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నరని ... బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో సాక్ష్యాలుగా.., అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారికి పలు రకాల పదవులు ఇవ్వడం.. ప్రయోజనాలు కల్పించడం వంటివి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. అయితే ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. తర్వాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ పిటిషన్ విచాణకు రావడం లేదు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో... జగన్ అక్రమాస్తుల కేసును ఇతర రాష్ట్రానికి తరలించాలని పిటిషన్ వేశారు.