Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Food Poisoning School: తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వెనుక కారణాలు నిగ్గు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
Taskforce To Find Out Causes Of Food Poisoning In Gurukul: తెలంగాణలోని (Telangana) గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువవుతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్‌ను (Taskforce) ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.
టాస్క్ ఫోర్స్‌లో మొత్తం 2 కమిటీలు ఉంటాయి. పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్, వార్డెన్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాలి. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. మరో కమిటీకి జిల్లా స్థాయి DSWO, DTWO, DBCWO, DEO అధికారిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
వరుస ఘటనలతో ఆందోళన
కాగా, రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో దాదాపు 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని శైలజ (16) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు, నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ నెల 26న అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. 'వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు.? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా..?. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు.' అని పేర్కొంది.
మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందించింది. ఫుడ్ పాయిజన్ వెనుక భారీ కుట్ర ఉందని.. త్వరలోనే దీన్ని ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని సూచించారు. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరుస ఘటనలతో మంత్రులు, అధికారులు వసతి గృహాలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజన తీరును పరిశీలించారు.