Minister Seethakka: 'కేటీఆర్.. దిలావర్‌పూర్ రండి అక్కడే తేలుద్దాం' - మంత్రి సీతక్క సవాల్, ఫుడ్ పాయిజన్ ఘటనలపైనా సంచలన వ్యాఖ్యలు
Telangana News: బీఆర్ఎస్ హయాంలోనే దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని సవాల్ విసిరారు.
Minister Seethakka Challenge To KTR: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో (Dilawarpur) ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో మాట్లాడదామని.. దిలావర్‌పూర్ రావాలని సవాల్ విసిరారు. 'బీఆర్ఎస్ హయాంలో ఎన్నో పరిశ్రమలకు కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండానే అనుమతులిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లక్షల ఎకరాల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం గ్రామసభల్లో ఒకరిద్దరిని రెచ్చగొట్టి అధికారులపైకి ఉసిగొల్పుతున్నారు. ఇథనాల్ పరిశ్రమలో డైరెక్టర్‌గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు ఏపీకి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఉన్నారు. ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చే సమయానికి మరో డైరెక్టర్‌గా తలసాని కుమారుడు సాయి ఉన్నారు.' అని పేర్కొన్నారు.
'అక్కడే తేలుద్దాం'
'దిలావర్‌పూర్‌లో కర్మాగారం ఏర్పాటు చేయించి రైతులను ముంచే ఆలోచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు అదే పార్టీ రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై కుట్రలు చేస్తోంది. 2023, ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం ఇథనాల్ కర్మాగారం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. 2023, జూన్ 15న కాళేశ్వరం ప్యాకేజీ నెం.27 నుంచి ఏడాదికి 18.351 ఎంసీఎఫ్‌టీ నీళ్లను కేటాయిస్తూ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కేటీఆర్.. ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు.?. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దాం. ఎవరు అనుమతులిచ్చారో అక్కడే తేలుద్దాం. మీ హయాంలోనే పరిశ్రమకు అనుమతులిచ్చినట్లు ఇప్పటికైనా ఒప్పుకోవాలి. ఈ అంశంపై ఆధారాలతో సహా త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తాం. తప్పుడు ప్రచారాలతో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరు.' అంటూ సీతక్క మండిపడ్డారు.
అనుమతులు రద్దు
అటు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ - గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాదాపు 3 రోజులుగా స్థానిక గ్రామస్థులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు కొందరు ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఎస్పీ వచ్చి గ్రామస్థులతో మాట్లాడగా.. మంత్రి హామీతో ఆందోళనకారులు శాంతించారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపైనా..
మరోవైపు, ఫుడ్ పాయిజన్ ఘటనలపైనా మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. దీని వెనుక ఎవరున్నారనేది బయట పెడతామని చెప్పారు. కుట్రదారులు వెనుక అధికారులు ఉంటే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించారు. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. జరుగుతున్నది ఆహార కలుషితం కాదని.. రాజకీయ కలుషితమని ఆరోపించారు.