Dastagiri: నన్నూ చంపేస్తారేమో కాపాడండి - పోలీసుల్ని ఆశ్రయించిన దస్తగిరి
Viveka Case: వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పోలీసుల్ని ఆశ్రయించారు. సాక్షులు వరుసగా చనిపోతున్నందున తనకూ రిస్క్ ఉందని భద్రత కల్పించాలని కోరారు.

Approver Dastagiri: వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. వివేకా హత్య కేసులో వరుసగా సాక్షులు మరణిస్తున్నారని తనకూ ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా సాక్షులు చనిపోతున్నారని వారు సహజంగా చనిపోతున్నారా ఏదైనా కుట్ర ఉందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఎస్పీ అందుబాటులో లేని కారణంగా కార్యాలయంలో లేఖ ఇచ్చారు.
తనకు బెదిరింపులు వస్తున్నాయన్న దస్తగిరి
అప్రూవర్ గా మారిన దస్తగిరికి గతంలో సీబీఐ అధికారుల సూచనలో టు ప్లస్ టు భద్రత కల్పించారు. తర్వాత తగ్గించారని త మరింత భద్రత పెంచాలని కోరారు. వివేకా కేసు అంశం అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని, సాక్షుల వరుస మరణాలు జరుగుతున్న తరుణంలో తనకు వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను కడప జైల్లో డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించారనన్నారు.
తమతో జగన్ వివేకాను హత్య చేయించాడని దస్తగిరి ఆరోపణ
వివేకాను తమచేత హత్య చేయించిన జగన్ మోహన్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే తామెందుకు భయపడాలని దస్తగిరి ప్రశ్నించారు. నిజాలు నిగ్గు తేల్చడానికి జగన్తో ఎక్కడికైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పులివెందులలో జగన్ ఇంటి వద్దే నివాసం ఉంటున్నానని.. 2021లో తాను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే కేసులో నిందితులు, కుట్రధారులు ఎవరనే విషయాలు బయటికి తెలిశాయన్నారు. తాను చెప్పింది తప్పని జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లలేదని దస్తగిరి ప్రశ్నించారు. హత్య చేయించింది వాళ్లే కాబట్టే అపుడు ఏం మాట్లాడ లేదన్నారు.
సాక్షుల వరుస మరణాలపై సిట్ వేసిన ప్రభుత్వం
సాక్షుల మరణాలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షులు ఆరుగురు మరణించడం వెనకున్న కారణాలను నిగ్గు తేల్చడానికి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్లో జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలతో పాటు ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరితోపాటు సాంకేతిక, ఫోరెన్సిక్ బృందం కూడా ఈ దర్యాప్తు బృందంలో ున్నారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతిపై భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్ట్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.





















