(Source: ECI/ABP News/ABP Majha)
Case On Dastagiri : అంతం చేయాలని కుట్ర - కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి !
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీని కలిశారు. ప్రాణభయం ఉందన్నారు. ఆదివారం ఆయనపై పోలీస్ కేసు నమోదైంది.
Case On Dastagiri : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరిపై తొండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెద్దగోపాల్ అనే వ్యక్తితో దస్తగిరి సోదరుడు మస్తాన్‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్దగోపాల్ తొండూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు మస్తాన్‌తో పాటు దస్తగిరిని కూడా పోలీసులు పిలిపించారు. అయితే పోలీస్ స్టేషన్‌లోనే ఈ అంశంపై వాగ్వాదం జరిగి తనపై దాడి చేసినట్లుగా పెద్దగోపాల్ కేసు పెట్టారు. మాటామాటా పెరగడంతో తొండూరు పీఎస్‌లోనే తనపై చేయి చేసుకున్నట్లు పెద్దగోపాల్ ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా తనను చంపుతానని కూడా బెదిరించాడని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తొండూరు పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ కావడంతో ఈ కే్సు నమోదు అంశం సంచలనం అయింది. తనపై కేసు నమోదైన అంశంపై దస్తగిరి కూడా స్పందించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనను వేధిస్తున్నారని కేసుల్లో ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కడప జిల్లా ఎస్పీని కలిశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలతో ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. తొండూరు పోలీసులు తనపై నమోదు చేసింది అక్రమ కేసని ఎస్పీకి తెలిపారు.
తనపై కేసు పెట్టిన పెద్ద గోపాల్ కావాలని కొద్ది రోజులుగా తనతో గొడవపడేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఘర్షణ పడుతున్నారని ఎస్పీకి తెలిపారు. తొండూరు వైఎస్ఆర్‌సీపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎస్పీకి తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారినందున ఏదో విధంగా తనను హత్య చేయాలని చూస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. ఏదో విధంగా తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు కూడా తెలియచేశానని దస్తగిరి ప్రకటించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయవర్గాల్లోనూ ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. హై ప్రోఫైల్ కేసు కావడం.. దస్తగిరి అప్రూవర్ గా మారిన అంశంపైనే ఎక్కువగా కేసు నడుస్తూండటంతో దస్తగరి విషయంలో ఏం జరిగినా సంచలనం అవుతోంది. గతంలో ప్రాణభయం ఉందని భద్రత లేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు నేరుగా ఆయనపై పోలీస్ కేస్ నమోదు కావడం సంచలనం అవుతోంది. గతంలో సీబీఐ ఎస్పీరాంసింగ్ పైనా కేసు నమోదైంది. అయితే హైకోర్టు స్టే ఇచ్చింది.