The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Prabhas Fans Disappointed: 'ది రాజా సాబ్' రిజల్ట్ కంటే సినిమా రిలీజ్ అయిన తీరుపై ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రిలీజ్ రచ్చకు బాధ్యులు ఎవరు?

డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ 2 తాండవం' ఆఖరి నిమిషంలో వాయిదా పడినప్పుడు సరైన ప్లానింగ్ లేదని అభిమానులు ఫీలయ్యారు. కనీసం ప్రీమియర్స్ & రిలీజ్ క్యాన్సిల్ అయిన విషయాన్ని 14 రీల్స్ కాస్త ఆలస్యంగా అయినా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ది రాజా సాబ్' రిలీజ్ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవహరించిన తీరు అంత కంటే దారుణంగా ఉంది.
ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇటువంటి రిలీజా?
కంటెంట్, క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలతో సంబంధం లేకుండా ఓపెనింగ్ డే వంద కోట్ల వసూళ్ళు రాబట్టగల పాన్ ఇండియా హీరో ప్రభాస్. ఆయన సినిమా అంటే రిలీజుకు మూడు నాలుగు రోజుల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ హంగామా ఉంటుంది. కానీ 'ది రాజా సాబ్'కు అటువంటిది ఏమీ లేదు. కనీసం బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? అనే సమాచారం కూడా అభిమానులకు సరిగా చేరవేయలేదు.
'ది రాజా సాబ్' రిలీజుకు ఏపీలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో టికెట్ రేట్స్ హైక్ జీవో వచ్చింది. ప్రీమియర్ షో టికెట్ రేటు 1000 రూపాయలుగా నిర్ణయించారు. అయితే తెలంగాణలో జీవో రావడం ఆలస్యం అయ్యింది. అందువల్ల, సరిగా ప్రీమియర్లు పడలేదు. దాంతో ఇక్కడి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
Also Read: తెలంగాణలో 'రాజా సాబ్' టికెట్టు గురువారం రాత్రి మూడొందలే... తెల్లారేసరికి 500 - కారణం ఏమిటంటే?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు తెలంగాణలో 'ది రాజా సాబ్' టికెట్ రేట్ హైక్ జీవో ఆలస్యం కావడానికి, జీవో వచ్చిన తర్వాత ప్రీమియర్లు వేయడంలో ఇబ్బందులు ఎదురు కావడానికి పలు కారణాలు ఉన్నాయ్. ఇక్కడ అసలు సమస్య అది కాదు... అభిమానులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మూసాపేటలోని శ్రీరాములు, బాలా నగర్ ఏరియాలోని విమల్ థియేటర్ వరకు... హైదరాబాద్ సిటీలో పలు థియేటర్లలో ప్రీమియర్స్ పడతాయని ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ ప్లానింగ్ వాళ్ళందరి ఎదురు చూపులపై లాఠీ ఛార్జ్ చేయించేలా చేసింది.
విమల్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షో కోసం వెయిట్ చేసిన అభిమానులకు మీడియాకు అక్కడ షో వేస్తున్నారని సమాచారం అందడంతో థియేటర్ దగ్గర నుంచి కదల్లేదు. పోలీసులు వచ్చి వాళ్ళను బయటకు పంపించాల్సి వచ్చింది. ఇతర థియేటర్ల దగ్గర అభిమానులు ఎదురు చూసి చూసి విసిగిపోయారు. అసలు శుక్రవారం షోలకు అడ్వాన్స్ బుకింగ్ గురువారం రాత్రి వరకు ఓపెన్ కాలేదు. ఈ తీరుపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ పట్ల అభిమానుల్లో తీవ్రమైన నిరాశ వ్యక్తం అవుతోంది. ఇది నిజంగా ఫ్యాన్స్ ఎమోషన్స్, అభిమానంతో ఆటలు ఆదుకోవడమే.





















