Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
High Speed Satellite Internet: ఎయిర్‌టెల్ ఇప్పటికే ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ కోసం యూటెల్‌శాట్ వన్‌వెబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టార్‌లింక్‌తో కొత్త ఒప్పందం ఎయిర్‌టెల్ కవరేజీని మరింత పెంచుతుంది.

Airtel - SpaceX Agreement: భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి భారతి ఎయిర్‌టెల్ - ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ స్పేస్‌ఎక్స్ (SpaceX) చేతులు కలిపాయి. మంగళవారం నాడు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ ఈ ఒప్పందం గురించి వెల్లడించింది. ఒప్పందం ప్రకారం, స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో ప్రారంభం అవుతాయి. అయితే, ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వం నుంచి ఆమోదం రావలసివుంది.
ప్రణాళిక ఏమిటి?
ఈ ఒప్పందం ద్వారా... ఎయిర్‌టెల్ - స్టార్‌లింక్ కలిసి భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరిస్తాయి. దీంతోపాటు, ఎయిర్‌టెల్ తన రిటైల్ షాపుల్లో స్టార్‌లింక్ పరికరాలను విక్రయిస్తుంది, వ్యాపారాల కోసం హై-స్పీడ్ ఉపగ్రహ ఇంటర్నెట్ (High Speed Satellite Internet)ను అందిస్తుంది.
ఈ ఒప్పందం వల్ల మనకేంటి ప్రయోజనం?
గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, మరింత మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడానికి రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. వైర్లతో పని లేకుండా, ఎయిర్ ఫైబర్ ద్వారా, ఇంటిలోకి నేరుగా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ అందుతుంది.
విన్-విన్ డీల్
స్టార్‌లింక్ ఉపగ్రహ సాంకేతికత ఎయిర్‌టెల్ ప్రస్తుత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఎయిర్‌టెల్‌కు ప్రస్తుం ఉన్న గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్పేస్‌ఎక్స్ ఉపయోగించుకుంటుంది. ఎయిర్‌టెల్, ఇప్పటికే ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ కోసం యూటెల్‌శాట్ వన్‌వెబ్‌తో డీల్ చేసుకుంది. స్టార్‌లింక్‌తో కుదిరిన నయా అగ్రిమెంట్ వల్ల ఎయిర్‌టెల్ కవరేజీ విస్తృతమవుతుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు చేరుతుంది. ఫలితంగా, మారుమూల ప్రాంతాల్లోని వ్యాపారాలు, కమ్యూనిటీలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది, ఆర్థిక వృద్ధికి కొత్త తలుపులు తెరుస్తుంది.
"ఈ భాగస్వామ్యం భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించే సామర్థ్యాన్ని మాకు అందిస్తుంది. ప్రతి భారతీయుడు తక్కువ ధరలో నమ్మకమైన ఇంటర్నెట్‌ను పొందగలిగేలా ఎయిర్‌టెల్ ఉత్పత్తులను స్టార్‌లింక్ మరింత మెరుగుపరుస్తుంది" - భారతి ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్
మోదీ-మస్క్ సమావేశం ప్రభావం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలో, మోదీతో స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు. భారత్‌లో టెస్లా కార్‌ల అమ్మకాలు, స్టార్‌లింక్ సేవలు, ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధన, కృత్రిమ మేధస్సు, స్థిరమైన అభివృద్ధిపై సహకారాన్ని పెంచడం సహా చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశం జరిగిన కొన్ని వారాల్లోనే భారతి ఎయిర్‌టెల్ - స్పేస్‌ఎక్స్ ఈ ఒప్పందం కుదరడం విశేషం.
భారతదేశంలో స్టార్‌లింక్‌కు సవాళ్లు & అవకాశాలు
ఎలాన్ మస్క్, తన స్టార్‌లింక్‌ను భారతదేశానికి తీసుకురావడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతులకు సంబంధించిన సవాళ్లు, రిలయన్స్ జియో వంటి దేశీయ టెలికాం దిగ్గజాల నుంచి వ్యతిరేకతల ఆ ప్రయత్నాలకు గండి కొట్టాయి. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ సమావేశం తర్వాత ఆ ఆటంకాలు ఒక్కొక్కటీ తొలగిపోతున్నాయి. ఇంటర్నెట్ సేవల విషయంలో, ప్రపంచంలోనే భారతదేశం ఒక భారీ మార్కెట్. మన దేశ జనాభా దాదాపు 145 కోట్లు. వీరిలో 40 శాతం మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. అంటే, భారత్‌లో వృద్ధి చెందడానికి స్టార్‌లింక్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి.





















