Avadhuta Kasinayana ashram in Nallamala: అవధూత కాశీనాయన ఎవరు? అసలు పేరేంటి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి .. ఆయన పేరుతో నల్లమలలో ఆశ్రమాలు ఎందుకున్నాయ్!
Avadhuta Kasinayana: అవధూత కాశీనాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపోతుంది. ఇంతకీ ఎవరీయన? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఈయన ఆశ్రమమాలు నల్లమల అడవుల్లో ఎందుకున్నాయ్?

Avadhuta Kasinayana ashram in Nallamala: కడప జిల్లా జ్యోతి మండలంలో ఉన్న అవధూత కాశినాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు తావిచ్చింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- BJP సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
అవధూత కాశీనాయన ఎవరు?
అవధూత కాశీనాయన ఈయన ఆధ్యాత్మిక గురువు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాశిరెడ్డి. బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అతిరాచ గురువయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో క్షేత్రాలు దర్శించారు.
గురువు ఆదేశానుసారం
పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పిన గురువు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు.
1895 జనవరి 15న జన్మించిన ఆయన 1995 డిసెంబరు 6 న పరమపదించారు. కాశీనాయన మరణానంతరం జ్యోతిక్షేత్రం..కాశీనాయన క్షేత్రంగా మారింది. ఈ క్షేత్రం నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెబుతారు.
కాశీనాయనకు మాయలు, మంత్రాలు లేవు. తాను గొప్పవాడిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు, మహిమలు ఉన్నాయని చెప్పుకోలేదు. సాధారణంగా ఉండేవారు.. చేయాలి అనుకున్న సేవలన్నీ చేసేవారు. ఆయన ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం.. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాశీనాయన ఆశీర్వచనం తీసుకుంటున్న దృశ్యం ఇది

కాశీనాయన ఆరాధనోత్సవాలు
ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా దత్త జయంతి సమయంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యం వేలమందికి అన్నదానం జరుగుతుంటుంది. పాడుపడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి అక్కడ నిత్యం అన్నదానం జరిగేలా కాశీనాయన అప్పట్లోనే ఏర్పాట్లు చేశారని స్థానికులు చెబుతారు.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆశ్రమాలు
కాశీ నాయన పేరుమీద తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆశ్రమాలున్నాయి..అక్కడ నిత్య అన్నదానాలు నిర్వహించడంతో పాటూ గోవులను సంరక్షిస్తుంటారు. ఈయన జీవిత కథ.. సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం, అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర పేరుతో పుస్తకాలుగా ముద్రితమైంది.
టైగర్ జోన్ పరిధి
కాశినాయన క్షేత్రం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలంటున్నారు అటవీశాఖాధికారులు. అయితే నిత్యం వేలమందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడి నుంచి తరలించడం సరికాదన్నారు భక్తులు. అయితే భక్తుల రక్షణార్థం ఆశ్రమం, ఆలయం చుట్టూ తగిన చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు.
నారా లోకేష్ హామీ
అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు… https://t.co/nOYn8PbE6l
— Lokesh Nara (@naralokesh) March 12, 2025
కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా బదులిచ్చారు మంత్రి నారా లోకేష్. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం అన్నారు. అటవీ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకుని అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చివేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నా అన్నారు. అంతేకాదు.. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటూ త్వరలోనే తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.






















