Asifabad Student Dies: విద్యార్థిని మృతిపై ప్రభుత్వం చర్యలు - ఆసిఫాబాద్ బీసీ హాస్టల్ అధికారిణిపై వేటు
Telangana News | విద్యార్థిని మృతిపై కలెక్టర్ చర్యలు చేపట్టారు. సంబంధిత హాస్టల్ అధికారిణిని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Hostel student dies in Kumram Bheem Asifabad district | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని తోర్రం వెంకటలక్ష్మి మృతికి కారణమైన హాస్టల్ అధికారిణిని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హాస్టల్ అధికారిని నిఖత్ తరన్నుంను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
డీఈడీ విద్యార్థిని మృతి
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తొర్రం వెంకటలక్ష్మి (19) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బెజ్జూర్ మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అసిఫాబాద్ లోని శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం (BC Hostel)లో అడ్మిషన్ తీసుకుంది. డీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో వారం క్రితమే హాస్టల్ కు వచ్చింది. అక్కడి భోజనం నచ్చకపోవడంతో ఎక్కువగా బయటి నుంచి పండ్లు తెచ్చుకుంటుంది.
హాస్టల్ అధికారిణినిపై కలెక్టర్ చర్యలు
ఈ క్రమంలో వెంకటలక్ష్మి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. సిబ్బంది 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే వెంకటలక్ష్మి అనారోగ్యంతో ఉన్న విషయం తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హాస్టల్ అధికారిణి విధుల్లో నిర్లక్ష్యం కారణంగా.. విద్యార్థిని మృతి చెందడంతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి హాస్టల్ అధికారిణిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి సజీవన్ ఒక ప్రకటనలో తెలిపారు.
స్కూల్ విద్యార్థులే కాదు ఇంటర్, డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు సైతం తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొన్ని రోజుల కిందట వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో ఉంటున్న శైలజ ఫుడ్ పాయిజన్ కావడంతో చనిపోయింది. ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మొత్తం ముగ్గురు విద్యార్థినులను నిమ్స్‌కు తీసుకురాగా, అందులో ఇద్దరు కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. నవంబర్ 25న శైలజ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుత్వ హాస్టల్స్ పై, ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, వారికి ఇప్పటినుంచైనా మెరుగైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు.