Yadadri Temple: పంద్రాగస్టు సందర్భంగా యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
Yadadri Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
Yadadri Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వాతంత్ర దినోత్సవం కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్సించుకునేందుకు వచ్చారు. యాదాద్రి జిల్లా ప్రజలే కాకుండా చుట్టు పక్కల జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వయంభువులకు నిత్యారాధనలు చేపట్టిన పూజారులు ప్రాకార మండపంలో కల్యాణం, అలంకార సేవోత్సవాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రత్యేక పూజలతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. పార్కింగ్, కోనేరు, గుట్ట దిగువన పెద్ద సంఖ్యలు భక్తులు ఉన్నారు. ప్రస్తుతం యాదాద్రీశ్వరుని ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
లడ్డూ ప్రసాదం కౌంటర్ల, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద సంది నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి సమస్యలు వాటిల్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Also:
మరోవైపు తిరుమల నడకమార్గంలో వెళ్లే భక్తులకు ఊతకర్ర
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. చిరుత సంచారం, దాడులు జరుగుతున్న కారణంగా నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీ సమావేశం ముగిసింది. నెలన్నర కిందట నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై జరిగిన చిరుత దాడి గానీ, లక్షితపై జరిగిన చిరుత దాడి చేసి చంపివేయడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సమావేశం అయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను (12 ఏళ్లలోపు వారిని) అనుమతించేది లేదు. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుంది.
నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే అనుమతిస్తామన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించేందుకు సిద్ధమన్నారు. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నడక మార్గం, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నడక మార్గంలో ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకుండా నిరోధిస్తే చర్యలు తప్పవన్నారు.