KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Telangana News: కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు.
Hyderabad News: తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఆరు జంక్షన్ల అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్ సీఐటీఐ(HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ(GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్ నెం. 45 , ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ అస్పత్రి జంక్షన్లను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం ప్రణాళికను తయారు చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ నాలుగు ఫ్లైఓవర్లు
నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగపోతుంది. కేబీఆర్ పార్కు ప్రాంతంలో ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గంటకు 30 వేలకు పైగా వాహనాలు కేబీఆర్ పార్కు పరిసరాల్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో సాధారణంగానే ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్(Traffic) ఇక్కట్లకు పుల్‌స్టాప్ పెట్టేందుకు.. ఈ పార్కు చుట్టూ అత్యంత రద్దీగా ఉన్న ఆరు ప్రాంతాల్లో నాలుగు ఫైఓవర్లను(Flyover) నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందుకు రూ.586 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నాలుగు ఫ్లైఓవర్లలో నాలుగు చోట్ల పాదచారుల కోసం సబ్‌వే(Subway)లు కూడా నిర్మించనున్నారు. ఈ జంక్షన్లో పాదాచారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల వారికి సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్ వే లను నిర్మించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
అతిపెద్ద పురాతన పార్క్
గత పదేళ్లలో రాయల్ సిటీ హైదరాబాద్ స్థిరమైన అభివృద్ధిని సాధించింది. ప్రపంచ గుర్తింపుతో నగరం సైబర్ సిటీగా మారింది. అన్ని కార్పొరేట్ బిల్డింగుల మధ్య ప్రకృతి తల్లికి చెందిన మరో అడవి ఉంది. సైబర్ సిటీలో రద్దీగా ఉండే ఐటీ పార్కులు ఉండగా, మెగాసిటీకి ఈ పూర్తి విరుద్ధమైన పార్క్ ఉంది. అదే కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం. ఈ పార్క్ చాలా ప్రాచీనమైనది. ఈ ప్రదేశాన్ని KBR నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఈ పార్కులో హైదరాబాద్ మాజీ నిజాం అద్భుతమైన చిత్తన్ ప్యాలెస్.. అనేక ఇతర చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఉద్యానవనం పరిసరాల్లో దాదాపు 600 రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి.
జంతుజాలం విషయానికి వస్తే.. పార్క్‌లో సుమారు 20 రకాల సరీసృపాలు, 13 జాతుల పక్షులు, 15 రకాల సీతాకోకచిలుకలు, 20 రకాల క్షీరదాలు, అనేక రకాల అకశేరుకాలు ఉన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంది. ఈ ఉద్యానవనం సుమారుగా 390 ఎకరాల (1.6 కి.మీ) విస్తీర్ణం కలిగి ఉంది. 1998లో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన తర్వాత ఈ పార్కు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ పార్క్‌గా ప్రకటించింది. ఇది జూబ్లీహిల్స్‌లో సెంట్రల్‌లో ఉంది. ఇందులో నెమళ్లు, ఇతర జంతువులు ఉన్నాయి.
Also Read: Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ