Pakistan Train Hijack:104 మంది బందీలను కాపాడిన పాక్ ఆర్మీ, కాల్పుల్లో 16 మంది మిలిటెంట్లు హతం
Passenger Train Jaffar Express Hijacked in Pakistan: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటనలో పాక్ ఆర్మీ రంగంలోకి దిగి 104 మంది పౌరులను రక్షించింది.

పాకిస్తాన్‌లో హైజాక్ అయిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ (Jaffar Express Train) నుంచి 80 మంది బంధీలను మిలిటెంట్ల చెర నుంచి పాక్ ఆర్మీ (Pakistan Army) విడిపించింది. వీరిలో 11 మంది చిన్నారులు, 26 మంది మహిళలు, 43 మంది పురుషులు ఉన్నట్లు సమాచారం. తరువాత మరో 24 మందిని సురక్షితంగా కాపాడారు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అదుపులో ఇంకా వందమందికి పైగా ఉన్నారని పాక్ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. పాక్ ఆర్మీ చేపట్టిన సహాయక చర్యల ఆపరేషన్‌లో 16 మంది బీఎల్ఏ మిలిటెంట్లు హతమయ్యారని అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ కనుమలోని పెషావర్‌కు మంగళవారం ఉదయం జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బయలుదేరింది. ఇందులోని మొత్తం తొమ్మిది బోగీల్లో సుమారు 500 వరకు ప్రయాణికులు ఉన్నారు. ట్రైన్ వెళ్తుండగా మార్గం మధ్యలో బలోన్‌లో 8వ నెంబర్ టన్నెల్ వద్ద బలూచ్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు జరిపింది. బాంబులు పెట్టి రైల్వే ట్రాకును సైతం పేల్చివేశారు. దాంతో చేసేదేమీ లేక జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను ఆపేయగా.. వెంటనే బలూచ్ లిబరేషర్ ఆర్మీ మిలిటెంట్లు రైల్లోకి చొరబడి హైజాక్ చేసి, ప్రయాణికులను బంధించారు. తాము జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశామని, ఘటనకు తామే బాధ్యులుగా ప్రకటించుకున్నారు. తమ వద్ద 200 మందికి పైగా బంధీలుగా ఉన్నారని బీఎల్ఏ స్పష్టం చేసింది. తాము 30 మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులను చంపేశామని బెలూచ్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు.
ఆర్మీ ఆపరేషన్ చేపట్టవద్దని వార్నింగ్..
కాల్పులు జరిపి, రైల్వే ట్రాక్ పేల్చివేసిన కాసేపటికే బీఎల్‌ఏ ఓ ప్రకటన విడుదల చేసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది తామేనని BLA ప్రతినిధి జీయంద్ బలోచ్ సంతకం చేసిన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. పాక్ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సైనిక చర్యలు, డ్రోన్ దాడులు లాంటివి చేయకుండా సమస్య పరిష్కరించుకోవాలని సైతం హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఆర్మీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని సైతం హెచ్చరించింది.
బీఎల్ఏ డిమాండ్లు ఏంటీ..
పాకిస్థాన్ నుంచి బలూచిస్తాన్ వేరు చేయాలని ఎప్పటినుంచో పోరాటం కొనసాగిస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను హైజాక్ చేసింది. బలూచ్ ప్రాంతానికి చెందిన రాజకీయ నేరస్తులను, కార్యకర్తలు, కనిపించకుండా తమ పౌరులను విడుదల చేయాలని బలూచ్ మిలిటెంట్లు పాక్ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు.
పాకిస్తాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్
పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ దేశంలో దాదాపు 44 శాతం భూభాగం ఆక్రమించి ఉంది. ఈశాన్యంలో కైబర్ కనుమ, తూర్పున పంజాబ్, ఆగ్నేయంలో సింధ్ ప్రావిన్సులను బలూచిస్తాన్ తన సరిహద్దులుగా కలిగి ఉంది. ఆ ప్రావిన్స్‌కు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన ఇరాన్, దక్షిణాన అరేబియా సముద్రం ఉన్నాయి. బలూచ్ లోని గ్వాదర్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద లోతైన సముద్ర ఓడరేవు ఉండగా.. అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతోంది. అయితే తమ ప్రావిన్స్ నుంచి విలువైన ప్రకృతి సంపదను పాక్ ప్రభుత్వం దోచుకుంటుందని బీఎల్ఏ ఆరోపిస్తోంది. గ్యాస్ వనరులు, ఖనిజ నిక్షేపాలను దోపిడీ చేసి చైనా ప్రయోజనాల కోసం పాక్ ప్రభుత్వం పనిచేస్తుందని బలూచ్ మిలిటెంట్లు పదే పదే ఆరోపిస్తున్నారు. ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి బలూచిస్తాన్ దేశం ప్రకటించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని బీఎల్ఏ నమ్ముతుంది.






















