Amrutham Serial: పాపం.. అమృతం కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు - టైలర్ డాక్టర్ అయ్యాడుగా.. ఎపిసోడ్ అంతా నవ్వులే నవ్వులు
Amrutham Serial Review: అమృతం సీరియల్ అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకూ ఫేవరెట్. అప్పట్లో ఆదివారం అయితే చాలు ఫ్యామిలీ అంతా టీవీలకు అతుక్కుపోయేవారు. అలాంటి అమృతం ఎపిసోడ్స్ మళ్లీ మీకోసం..

Amrutham Serial Episode 6 Review: నగరంలో పక్కపక్కనే ఉండే ఇళ్లు.. అందులో ప్రాణ స్నేహితులు అంజి, అమృతం. వారు చేసే తింగరి పనులతో కోరి కష్టాలు తెచ్చుకుంటుంటారు. వీరి చేష్టలు ఆద్యంతం నవ్వు తెప్పిస్తుంటాయి. అది అమృతం సీరియల్ (Amrutham Serial) అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్ 90sలో ఎవర్ గ్రీన్. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ సీరియల్ చూస్తూ కాస్త రిలాక్స్ ఫీల్ అవుతుంటారు చాలామంది. అలాంటి హాస్య రసామృతం ఎపిసోడ్స్ మళ్లీ మీకోసం..
అమృతం కడుపునొప్పిని టైలర్ ఎలా పోగొట్టాడో తెలుసా..?
అమృతంలో 'వైద్యో నారాయణో హరి' ఎపిసోడ్ విషయానికొస్తే.. అమృతం కడుపునొప్పితో విలవిల్లాడిపోతుంటాడు. ఈ రోజు ఆఫీస్‌కు వెళ్లలేనని సంజీవనితో చెప్పగా.. అదేం కుదరదు ఆఫీస్‌కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టి ఆఫీస్‌కు పంపిస్తుంది. అయితే, ఆఫీసులోనూ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా.. మేనేజర్ అంబుజనాభం వచ్చి అర్జెంట్ ఫైల్స్ కంప్లీట్ చేయాలంటాడు. వాటిని పూర్తి చేసి ఇంటికి వెళ్లిన అమృతం కింద పడి విలవిల్లాడిపోతాడు. దీంతో సంజీవని కడుపునొప్పి తగ్గే చిట్కా అంటూ ఓ కషాయాన్ని తెచ్చి బలవంతంగా తాగిస్తుంది. అది తాగిన మరుక్షణం నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అదే సమయానికి అక్కడకు వచ్చిన అంజి డాక్టర్‌ను తీసుకొస్తాడు. అయితే, ఎంతమంది డాక్టర్లకు చూపించినా నొప్పి మాత్రం తగ్గదు.
ఇక సంజీవని ఓ హోమియోపతి వైద్యుడి దగ్గరకు అమృతాన్ని తీసుకెళ్లి చూపిస్తుంది. అతను చెక్ చేసి 'సగ్గుబియ్యతేనీయం' అనే గుళికల మందు ఇస్తాడు. ఏది వాడిని నొప్పి మాత్రం తగ్గదు. ఇక చివరకు ఓ డాక్టర్ దగ్గరకు వెళ్తే టెస్టులన్నీ చేసి రూ.వేల బిల్లు చేతిలో పెడతాడు. ఇవన్నీ చేసినా నొప్పి తగ్గకపోయే సరికి అమృతం డీలా పడతాడు.
టైలర్ డాక్టర్ అయ్యాడుగా..
ఇక లాభం లేదనుకుని ఆ మందులు అలా కంటిన్యూ చేస్తుండగా.. సంజీవని, అమృతం ఇద్దరూ ఓ టైలర్ షాపునకు వెళ్తారు. 4 రోజుల్లో బట్టలు కావాలని చెప్పి మెజర్మెంట్స్ తీసుకోమంటారు. టైలర్ కొలతలు తీసుకుంటుండగా.. నడుము 34 అని చెప్తే కాదు 30 అని వాదిస్తాడు అమృతం. 9 నెలల క్రితం బట్టలు కుట్టించానని చెప్పగా.. ఈ మధ్య మీకేమైనా కడుపు నొప్పి వస్తుందా..? అని టైలర్ అడగ్గా.. అరే అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావంటూ టైలర్‌ను అడుగుతారు. ఫ్యాంట్ సైజ్ 34 ఉండాల్సిన చోట 30 ఉంటే కడుపునొప్పి అలానే వస్తుందని చెబుతాడు టైలర్. ఇప్పుడున్న పాత ఫ్యాంట్లన్నీ రిపేర్ చేసి కొత్త ఫ్యాంట్లు 34 పెట్టించుకోమని చెబుతాడు. దాంతో కడుపు నొప్పి తగ్గిపోతుందని సలహా ఇస్తాడు టైలర్. అప్పటికీ కానీ అర్థం కాదు అమృతంకు ఫ్యాంటు టైట్ కావడం వల్ల తనకు కడుపు నొప్పి వచ్చిందని.. ఎంత ఫన్నీ కదా.. ఆ ఎపిసోడ్ ఇక్కడ చూసేయండి.






















