Impact Player: ఇది కదా ‘ఇంపాక్ట్’ అంటే - వెంకటేశ్ అయ్యర్ సరికొత్త చరిత్ర
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ లో ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సరికొత్త అర్థం చెప్పాడు.
GT vs KKR: ఐపీఎల్-16లో ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి తీసుకొచ్చిన నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’. మ్యాచ్ ఆడే జట్లు తమ తుది జట్టును ప్రకటించకుండా ఒక ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునేందుకు అవకాశం కల్పించే నిబంధన ఇది. అయితే ఐపీఎల్ - 16 మొదలై పది రోజులు గడుస్తున్నా దాదాపు అన్ని జట్లూ రెండేసి మ్యాచ్ లు ఆడినా ఈ నిబంధన సరిగా వర్కవుట్ కాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించుకునే క్రమంలో దాదాపు అన్ని జట్లూ విఫలమయ్యాయన్న అపవాదు కూడా ఉంది. కానీ గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఈ నిబంధన మూలసూత్రానికి న్యాయం చేశాడు కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్.
టూకీగా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ గా జట్టులోకి వచ్చే ఆటగాడు (ఇంపాక్ట్ ప్లేయర్) మ్యాచ్ గతిని మార్చాలి. అతడి ప్రభావం ఆ గేమ్ వరకు కచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ నిబంధనకు సరైన న్యాయం చేసినట్టు ఉంటుంది. కానీ ఈ లీగ్ లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తుషార్ దేశ్‌పాండే నుంచి మొదలుకుని నిన్నా మొన్నటి దాకా ఆడిన ఏ ఆటగాడు కూడా మ్యాచ్ మీద స్పష్టమైన ముద్ర వేయలేకపోయారు. తుషార్, రిషి ధావన్, నవ్‌దీప్ సైనీ, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ వంటి వాళ్లు మ్యాచ్ పై ప్రభావం చూపలేదు. ప్రభావం చూపకపోగా కొన్నిసార్లు వీళ్ల వల్లే మ్యాచ్ లు ఓడిపోయాయి. గుజరాత్ తో చెన్నై ఓటమికి కారణం తుషార్ చెత్త బౌలింగే. కానీ నిన్న కేకేఆర్-జీటీ మ్యాచ్‌లో మాత్రం ఈ రూల్‌కు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్.. నిన్న కేకేఆర్ మ్యాచ్ నెగ్గడంలో ఆఖర్లో రింకూ సింగ్ పాత్ర ఎంత ఉందో అందుకు సమానంగా అయ్యర్ పాత్ర కూడా ఉంది.
అలా మొదలై..
గుజరాత్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. ఎదుర్కున్న రెండో బంతికే భారీ సీక్సర్ కొట్టాడు. కానీ కొద్దిసేపటికే కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ నితీశ్ రాణా అండగా.. అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. యశ్ దయాల్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్ లను ఆటాడుకున్నాడు. నితీష్ రాణాతో కలిసి హండ్రెడ్ ప్లస్ పార్ట్‌నర్‌షిప్ తో కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. మరో రెండు ఓవర్లు ఉండుంటే అయ్యర్.. సెంచరీ కూడా చేసేవాడేమో అన్నంతగా అతడి విధ్వంసం సాగింది. మొత్తంగా 40 బంతులు ఆడిన అయ్యర్.. 8 బౌండరీలు, 5 సిక్సర్లతో 83 రన్స్ చేశాడు.
ఇలా ముగిసింది..
వెంకటేశ్ అయ్యర్ కంటే ముందే నితీశ్ రాణా వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో 155-4గా ఉన్న కేకేఆర్.. విజయం దిశగా పయనించే క్రమంలో రషీద్ ఖాన్ ఇచ్చిన షాక్ తో కుదేలైంది. 17వ ఓవర్లో రషీద్ హ్యాట్రిక్ తీశాడు. కేకేఆర్ కు విజయం కావాలంటే 12 బంతుల్లో 43 పరుగులు చేయాలి. అసలు గెలుపు మీద ఆశలే లేని స్థితి నుంచి కేకేఆర్ విజయం సాధించిందంటే అది రింకూ సింగ్ చలవే. జోషువా లిటిల్ వేసిన 19వ ఓవర్లో 6,4 బాదిన రింకూ.. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది కేకేఆర్ కు మరుపురాని విజయాన్ని అందించాడు.