IND vs AUS Final: టీమిండియా వెన్నెముక రాహుల్ -బ్యాటింగ్, కీపింగ్‌లో తనదైన ముద్ర
World Cup 2023 Final: ప్రపంచకప్ తుది జట్టును ప్రకటించినప్పుడు కె.ఎల్.రాహుల్ పేరు విని చాలామంది పెదవి విరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పైనా విమర్శలు చేశారు.
ODI World Cup 2023: కె.ఎల్.రాహుల్.. ప్రపంచకప్ తుది జట్టును ప్రకటించినప్పుడు ఈ పేరు విని చాలామంది పెదవి విరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పట్టుపట్టి మరీ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవడంతో వారిపైనా విమర్శలు చేశారు. నిదానంగా బ్యాటింగ్ చేసే రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని చాలామంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాల మధ్య కె.ఎల్. రాహుల్ ప్రపంచకప్ బరిలోకి దిగాడు. అది అయిదుసార్లు ప్రపంఛ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా భారత్ 2 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడు విరాట్‌తో కలిసి రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో 115 బంతులకు 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఆ విజయంతో రాహుల్‌ను తీసుకోవడం సరైందనని కొందరికీ అర్థమైంది.
ఇక్కడ కట్‌చేస్తే... న్యూజిలాండ్‌తో సెమీస్... తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగులు చేసింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ఈ దశలో మహ్మద్ షమీ వేసిన బంతి డేవాన్ కాన్వే బ్యాట్ అంచును తాకుతూ రాహుల్‌కు కోహ్లీకి మధ్యలోకి దూసుకెళ్లింది. అంతే అద్భుతంగా డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను రాహుల్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో రాహుల్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం సరైందేనని అందరికీ అర్థమైంది. ఈ ప్రపంచకప్ మొత్తంలో రాహుల్ 15 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి వేగంగా సెంచరీలు చేసేస్తున్నాడు. భారత జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఓవైపు రోహిత్, కోహ్లీ విధ్వంసం సృష్టిస్తుంటే మరోవైపు రాహుల్ స్కోరు బోర్డును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. నిశ్శబ్దంగా తన పనితాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. నెదర్లాండ్స్‌పై 64 బంతుల్లోనే మెరుపు శతకం బాది రికార్డు సృష్టించాడు. సెమీస్‌లో కేవలం 20 బంతుల్లో అమూల్యమైన 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 77 సగటుతో 386 పరుగులు సాధించాడు. రాహుల్ ఓపెనర్‌గా 23 మ్యాచ్‌ల్లో 915 పరుగులు చేశాడు. దీనిలో మూడు శతకాలు, ఆరు అర్థ శతకాలు ఉన్నాయి. సగటు 43.57 కాగా.. స్ట్రైక్ రేట్ కేవలం 79 మాత్రమే. 4, 5వ స్థానాల్లో అతడు మొత్తం 40 మ్యాచ్‌లు ఆడాడు. సగటు 56కు పైగా ఉంది. 4 శతకాలు, 10 అర్ధ శతకాలు బాది 1674 పరుగులు చేశాడు. 11 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.
బ్యాటర్‌గా చాలాసేపు క్రీజులోనే ఉన్నా కీపింగ్ విషయంలో రాహుల్ ఎక్కడ అలసటగా కనిపించడం లేదు. కీపర్‌గా మైదానంలో చురుగ్గా కదులుతూ.. కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొన్నాడు. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో తాను బౌలర్‌ని పట్టించుకోనని కీపర్‌పైనే ఆధారపడతానని గతంలోనే కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో రోహిత్ విశ్వాసాన్ని రాహుల్ నిలబెట్టుాడు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై తొలి ఓవర్లలో బుమ్రా అప్పీళ్లతో రాహుల్ ఏకీభవించలేదు. రోహిత్ డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. ఆ తర్వాత అవి నాటౌట్లని రీప్లేలో కనిపించాయి. ఇప్పుడు టీమ్ ఇండియాలో డీఆర్‌ఎస్ అంటే ‘డెసిషన్ రాహుల్ సిస్టమ్’గా మారిపోయింది.