Nagoba Jatara: అడవి బిడ్డల సంబురానికి వేళాయె - అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభం, ఆచారం వెనుక కథ ఇదే!
Adilabad Heritage: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర మహాఘట్టం ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించిన మెస్రం వంశీయులు మహాపూజను ప్రారంభించారు.
![Nagoba Jatara: అడవి బిడ్డల సంబురానికి వేళాయె - అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభం, ఆచారం వెనుక కథ ఇదే! tribal heritage nagoba jatara started in indravelli in adilabad district Nagoba Jatara: అడవి బిడ్డల సంబురానికి వేళాయె - అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభం, ఆచారం వెనుక కథ ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/91a05d6d30b64c9be88e4566ec5f770e1738123235204876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nagoba Jatara Started In Adilabad: అడవి బిడ్డల సంబురం నాగోబా జాతర (Nagoba Jatara) ప్రారంభమైంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మెస్రం వంశీయులు నాగోబా మహాపూజ ప్రారంభించారు. తెల్లటి తలపాగాలు, తెల్లని వస్త్రాలు ధరించి మహాపూజలో పాల్గొన్న మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు మహపూజలో పాల్గొని నాగోబాను దర్శించుకున్నారు. మరి ఈ సంబురం వెనుక ఉన్న ఆచార సంప్రదాయాలు, వేడుక ఎలా నిర్వహిస్తారో ఓసారి చూస్తే..
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ (Keslapur) గ్రామంలో కొలువైన నాగోబా ఆలయంలో వేడుక ఘనంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి అమావాస్య సంధర్బంగా మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. డోలు వాయిద్యాలు, కాలికొం, పెప్రే, సన్నాయిల మధ్య అరణ్య రాగాలతో ఆలయమంతా మార్మోగింది. తెల్లని దుస్తులు, తలపాగాలు ధరించి, మెస్రం వంశీయులు భక్తి శ్రద్ధలతో నాగోబాకు మహాపూజ నిర్వహించారు. ఏడు రకాల నైవేద్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు మెస్రం వంశీయులు. సాంప్రదాయ రీతిలో పూర్వకాలం నుంచి వస్తోన్న ఆచారాల ప్రకారం క్రతువు నిర్వహించారు. నూతన ఉరవడిలో ఆలయానికి రంగురంగుల విద్యుత్ కాంతులను అలంకరించి ఆలయానికి కొత్త కళను తెచ్చారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవగా.. మహాపూజ అనంతరం ఒక్కొక్కరిగా ముఖ్య అతిథుల అనంతరం ఇతరులు సైతం నాగోబాను దర్శించుకున్నారు.
నెలవంక చూశాక సాంప్రదాయ రీతిలో ఈ నెల 10న పాదయాత్రగా వెళ్లిన మెస్రం వంశీయులు ఈ నెల 17న హస్తలమడుగు వద్దకు వెళ్లి పవిత్ర గంగాజలం సేకరించి, ఈ నెల 24న ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవికి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కేస్లాపూర్‌లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. 28న నాగోబా మురాడి దేవాలయం నుంచి నాగోబా పాత విగ్రహాలు, ఆభరణాలతో ఆలయానికి చేరుకుని, సాంప్రదాయ పూజలో భాగంగా కుండలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అల్లుళ్లు, కోడళ్లు కుండలో కోనేరు నుంచి నీరు తీసుకువచ్చి పుట్టను తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం నిర్వహించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, మహాపూజను ప్రారంభించామని మెస్రం వంశీయులు చెబుతున్నారు.
జాతర ఏర్పాట్లను సమిష్టిగా నిర్వర్తించామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నాగోబా జాతరను ఒక పండుగ లాగా, వైభవంగా అందరు కలిసికట్టుగా జరుపుకోవాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఫిబ్రవరి 4 వరకు ఈ జాతర కొనసాగుతుందని, జాతరకు వచ్చే భక్తులు క్షేమంగా రాకపోకలను కొనసాగించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సైతం సూచించామని, అందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, నాగోబాను దర్శించుకుని జాతరను విజయవంతం చేయాలన్నారు.
కొత్త కోడళ్లకు భేటింగ్
నాగోబా జాతరలో మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాల్లో భాగంగా మహాపూజ అనంతరం కొత్తకోడళ్లకు బేటింగ్ నిర్వహించనున్నట్లు ఆ వంశ మహిళలు చెబుతున్నారు. మెస్రం వంశంలోకి కొత్తగా వచ్చిన కోడలు తమ కులదైవాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ఈ భేటింగ్ తప్పనిసరి అని.. భేటింగ్ తర్వాతనే తమ కుల దైవాన్ని చూసే అర్హతను కలుగుతారని, లేదంటే వారు అర్హులు కాదని మెస్రం వంశీయులుగా పరిగణింపబడరని, అందుకనే ఈ భేటింగ్ అనే కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. కొత్త కోడల్లు తెల్లని వస్త్రాలు ధరించి, మొహం కనపడకుండా తలపై కొంగు వేసుకుని కిందికి వంగి ఈ భేటింగ్‌లో పాల్గొంటారని, ముందుగా సత్తిక్ దేవతల వద్ద సాంప్రదాయ రీతిలో ఇద్దరినీ ఒక్కో జతగా పెద్దల సమక్షంలో తమ కులదైవాలకు పరిచయం చేసి దర్శించుకునే భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు.
అదే ఆచారం..
మెస్రం వంశీయులు నిర్వహించే పూజలు, సాంప్రదాయ ఆచార కార్యక్రమాలు, వీటన్నింటిలోనూ డోలు సన్నాయిలు, వాయిద్యాలు ఒక భాగం అని, ఒక్కో రకమైన సాంప్రదాయానికి ఒక్కో రకమైన డోలు వాయిద్యం వాయిస్తూ ఉంటామని, మెస్రం వంశీయులు ఏబీపీ దేశంతో వివరించారు. సోలా డేంసా అట్రా వాజలో భాగంగా తమ ఆచార సాంప్రదాయంలో భాగంగా వీటిని వాయిస్తుంటామని, పూజా కార్యక్రమంలో ఒక రకమైన డోలు, భేటింగ్ సమయంలో మరొక రకమైన డోలు, కొత్త కోడళ్ళకు పరిచయం చేసే సమయంలో మరొక రకమైన డోలు వాయిద్యం, ఇలా సాంప్రదాయ రీతిలో రకరకాల వాయిద్యాలు వాయిస్తూ తమ ఆచరాన్ని నేటికీ కొనసాగిస్తున్నామన్నారు. నాగోబా జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, మెస్రం వంశీయులు తరలివచ్చారు.
Also Read: BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం - గ్రౌండ్ ను బీజేపీ, కాంగ్రెస్‌కు వదిలేస్తున్నట్లే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)