Bowel problems: మీరు రోజులో ఎన్నిసార్లు మలవిసర్జన చేస్తున్నారు? ‘గోల్డీలాక్స్ జోన్’ అంటే? మీ మలం ఇలా ఉంటే ముప్పే!
మీరు నిత్యం ఎన్నిసార్లు మలవిసర్జన చేస్తున్నారో లెక్కించారా? సాధారణ అలవాటు కంటే ఎక్కువసార్లు లేదా తక్కువ సార్లు విసర్జనకు వెళ్తున్నారంటే తప్పకుండా ఆలోచించాల్సిందే.
ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోవడం సర్వసాధారణమే. ఉదయాన్నే కడుపులో ఉన్నదాన్ని ఖాళీ చేసుకోవడం కూడా మంచి అలవాటే. అయితే, రోజులో ఎన్నిసార్లు మల విసర్జన చేస్తున్నారనేది కూడా పాయింటే. రోజులో ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జనకు వెళ్తున్నట్లయితే పర్వాలేదు. కానీ, వారంలో 3 నుంచి 4 సార్లు లేదా రోజు విడిచి రోజు మలవిసర్జన చేసేవారు కొన్ని విషయాలు ఆలోచించాలి. అది అలవాటా లేదా అనారోగ్యమా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే.. కొందరు అలవాటుగా రోజు విడిచి రోజు మల విసర్జనకు వెళ్తారు. కానీ, కొందరిలో అకస్మాత్తుగా ఆ అలవాటు వస్తుంది. ముఖ్యంగా వాళ్లు వెళ్లాలి అనుకున్నా రాకపోవడం కూడా కారణం కావచ్చు. అలాంటివారు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
ఏదీ సాధారణం? ఏది అతిసారం?
ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో పరిశోధకులు.. వారంలో ఎన్నిసార్లు మలవిసర్జనకు వెళ్తే మంచిదనే విషయాన్ని వెల్లడించారు. వారంలో ఒకటి లేదా రెండుసార్లు మలవిసర్జనకు వెళ్లడం మలబద్ధకానికి సూచన. అలాగే వారంలో 3 నుంచి 6 సార్లు విసర్జనకు వెళ్తున్నట్లయితే సాధారణ కంటే తక్కువ. అలాగే ఒక్క రోజులో 1 కంటే 3 సార్లు విసర్జనకు వెళ్తున్నట్లయితే.. సాధారణం కంటే కాస్త ఎక్కువ. అలాగే, రోజులో 3 కంటే ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం.. అది అతిసారం. రోజుకు ఒకసారి మలవిసర్జన చేసే అలవాటు ఉన్నట్లయితే మంచిదే. ఈ అలవాటునే ‘గోల్డీలాక్స్ జోన్’ అంటారు. అంటే, మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు లెక్క.
ఈ మూడు అంశాలతో ముడి..
మన మల విసర్జన అలవాటు మన లైఫ్‌స్టైల్ మీదే కాదు. మన వయస్సు, జన్యువులు, మైక్రోబయోమ్‌లపై కూడా ఆధారపడి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మన బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ BMI, 30 ఏళ్లు కంటే తక్కువ వయస్సు గల మహిళల్లో ఎక్కువ మలవిసర్జన సమస్యలు ఉంటాయని కనుగొన్నారు.
మలం కడుపులోనే ఉండిపోతే ప్రమాదం
చాలామంది తరచుగా విసర్జనకు వెళ్లడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆఫీసులో వర్క్ చేసేవారు అక్కడి టాయిలెట్లలో వెళ్లడానికి ఇష్టపడరు. దానివల్ల వారి కడుపులోనే మలం ఎక్కువ గంటలు ఉండిపోతుంది. దాని వల్ల ఆ మలం పేగులకు అతుక్కుపోయి గట్టిపడుతుంది. బాగా గట్టిపడిన తర్వాత విరిగిపోయే అవకాశం కూడా ఉంది. దీనివల్ల రక్త ప్రవాహంలోకి ప్రమాదకరమైన విషతుల్యాలు చేరే అవకాశం ఉంది. అది కిడ్నీ వ్యాధులకు కారణం కావచ్చు. అలాగే పదే పదే మలవిసర్జనకు వెళ్లేవారిలో కాలేయ సమస్యలు కారణం కావచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే
మీరు డైలీ ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తున్నారనే విషయంపై మీకు అవగాహన ఉండే ఉంటుంది. అలా కాకుండా సాధారణం కంటే తక్కువ లేదా ఎక్కువసార్లు మీరు విసర్జనకు వెళ్తున్నట్లయితే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే మలబద్ధకం, విరేచనాలు, అతిసారం వంటివి పేగు క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు. ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (Irritable bowel syndrome - IBS) వల్ల కూడా మలవిసర్జనలో మార్పులు వస్తాయి. రెండు లేదా మూడువారాల పాటు మీలో మలానికి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నట్లయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
రంగు, వాసన, రూపంతో సమస్య తెలుసుకోవచ్చా?
మీ మలం రంగు, వాసన, దాని రూపాన్ని చూసి మీ ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు.. ఎలాంటి ఒత్తిడి చేయకుండా మలవిసర్జన జరిగితే.. మీకు ఏ సమస్య లేనట్లే. కడుపులో నొప్పిగా ఉండి.. బలవంతం చేస్తేగానీ విసర్జన జరగడం లేదు అంటే మాత్రం డాక్టర్‌ను కలవాలి. అలాగే ఎలాంటి ప్రమేయం లేకుండా మరీ లూజ్‌గా విసర్జన జరుగుతున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే.. అది లూజ్ మోషన్స్ నుంచి డయేరియా (అతిసారం)కు దారితీయొచ్చు.
మల విసర్జన సమస్యలను ఎలా అరికట్టవచ్చు?
మల విసర్జన సమస్యలను కంట్రోల్ చేయగలిగే మందు మన చేతిలోనే ఉంది. అదే ‘ఫైవర్ ఫుడ్’. ఔనండి.. మీరు తినే ఆహారంలో ఉండే ఫైబర్ మీ పనిని సులభం చేసేస్తుంది. కడుపులో ఉండే వ్యర్థాలను తొలగించడమే కాకుండా విసర్జను మృదువుగా, పేగుల నుంచి సులభంగా వెళ్లేలా చేస్తుంది. అలాగే రోజూ మీరు నీళ్లు తాగడాన్ని అలవాటుగా మార్చుకుంటే ఏ సమస్య ఉండదు. మరింత సాఫీగా విసర్జన జరుగుతుంది. కడుపును ఇబ్బంది పెట్టే మాంసాహారాలను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఉడికీ ఉడకని ఆహారం అస్సలు వద్దు.
రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, నట్స్, హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌లో మనకు కావల్సినంత ఫైబర్ ఉంటుంది. డైలీ కనీసం 10 గ్లాసుల నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్యలే రావని సూచిస్తున్నారు. ఎప్పుడూ ఒకే చోట కూర్చోకుండా.. కాస్త అటూ ఇటూ తిరుగుతుండాలి. కదలకుండా ఒకే చోట ఉంటే జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఆహారం తిన్న తర్వాత కాసేపు నడవాలని సూచిస్తారు. అయితే, తిన్న తర్వాత అతిగా వాకింగ్ లేదా వ్యాయామం చెయ్యకూడదు.
Also Read: వెలుగుల చాటు చీకటి - ఈ టైమ్‌లో లైట్లు ఆన్‌చేసి కూర్చుంటే మధుమేహం ముప్పు తప్పదట!