Bholaa Shankar: కూర్చోని మాట్లాడుకోండి, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కోర్టు సూచన-‘భోళా శంకర్‘కు గ్రీన్ సిగ్నల్
‘భోళా శంకర్‘ సినిమాకు సంబంధించి ఓ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాణ సంస్థ తనకు ఇవ్వాల్సిన బకాయిలను క్లియర్ చేసే వరకు చిత్ర ప్రదర్శను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కింది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇవాళ(ఆగష్టు11న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టును ఆశ్రయించాడు.
ఇంతకీ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సమస్య ఏంటి?
అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాకు సంబంధించి నిర్మాతలు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్‌తో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కి కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అదే సంస్థకు చెందిన మేకర్స్ తమ కొత్త చిత్రం ‘భోలా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే, సదరు డిస్ట్రిబ్యూటర్ తన బకాయిలను క్లియర్ చేసే వరకు ప్రదర్శనన నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ‘భోళాశంకర్’ నిర్మాత అనిల్ సుంకర తనను రూ.30 కోట్లు మోసం చేశారని ఆరోపించారు.
న్యాయస్థానం ఏం చెప్పిందంటే?
వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వేసిన కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా ప్రదర్శన నిలిపివేయడం కుదరదని తేల్చి చెప్పింది. సమస్యలను సదరు నిర్మాణ సంస్థతో కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించింది."AK ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కోర్టు కేసుకు సంబంధించిన అన్ని చట్టపరమైన సమస్యలు తొలగిపోయాయి. సదరు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ తన కేసును ఉపసంహరించుకున్నారు. ‘భోళా శంకర్’ ప్రదర్శనకు ఎలాంటి ఆటంకం ఉండబోదు” అని మేకర్స్ ప్రకటించారు.
తెలంగాణలో ఇలా, ఏపీలో అలా!
‘భోళా శంకర్’ సినిమాకు సంబంధించి తెలంగాణ సర్కారు టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఏపీ సర్కారు మాత్రం సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంగా టిక్కెట్ల ధర పెంపుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని వెల్లడించింది. రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతలు చెప్పినా, అవసరమైన పత్రాలను ఇవ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఏపీలో ఈ సినిమా షూటింగ్ 20 శాతం కొనసాగినట్లు ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది. పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. సినీ రంగానికి సంబంధించి ఎలాంటి వివక్ష లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లు చూపించి టిక్కెట్టు ధరలను పెంచుకోవచ్చని సూచించారు.
Read Also: ఆ సినిమాలు సరిగా ఆడకపోయినా, బాధపడలేదు - దర్శకుడు రాజమౌళి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial