(Source: ECI/ABP News/ABP Majha)
SS Rajamouli: ఆ సినిమాలు సరిగా ఆడకపోయినా, బాధపడలేదు - దర్శకుడు రాజమౌళి
అబ్బాయిలు తొలిసారి బైక్ నడిపిన అనుభూతిని జీవితంలో మర్చిపోలేరని దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఉస్తాద్’ ట్రైలర్ చూశాక తనకు కూడా తొలిసారి బైక్ నడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయని వెల్లడించారు.
కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. ఈ మూవీలో కావ్యా కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఫణిదీప్ దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా శనివారం(ఆగష్టు 12)నాడు విడుదలకానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, శైలేష్ కొలను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిగ్ టికెట్‌ని ఆవిష్కరించారు.
అనుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది
ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు రాజమౌళి, శ్రీసింహా కష్టపడే స్వభావం ఉన్న అబ్బాయని చెప్పారు. కచ్చితంగా తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. “నేను, మా పెద్దన్న(కీరవాణి) ఎంతో కష్టపడి పైకి వచ్చాం. తమ కష్టం గురించి శ్రీసింహాకు బాగా తెలుసు. తను కూడా బాగా కష్టపడే లక్షణం ఉంది. మా దారిలోనే తను కూడా కష్టపడి పైకి రావాలి అనుకుంటున్నాడు. తను నటించిన కొన్ని సినిమాలు సరిగా ఆడకపోయినా, బాధపడలేదు. మరింత కష్టపడి సినిమాలు చేస్తూ తన లక్ష్యాన్ని సాధించే దిశగా వెళ్తున్నాడు” అని చెప్పారు.
తొలిసారి బైక్ నడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి
ఈ ఈవెంట్ లో ‘ఉస్తాద్’ ట్రైలర్, టీజర్ కంటే ముందు బైక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని రాజమౌళి చెప్పారు. “అబ్బాయిలు తొలిసారి బైక్ నడిపిన మధుర జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఈ బైక్ పోస్టర్ చూశాక, నేను నడిపిన తొలి బైక్ గుర్తుకు వచ్చింది. అబ్బాయిలకు బైక్ చేతికి వస్తే వెంటనే రెక్కలు వచ్చి స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పక్షిమాదిరిగా సంతోష పడతారు. బైక్ తో మొదలయ్యే యువకుడి ప్రయాణం పైలెట్ వరకు తీసుకెళ్లడం నాకు నచ్చింది” అని చెప్పుకొచ్చారు.
జీవితంలో ఈ సినిమా గుర్తుండిపోతుంది- నాని
హీరో శ్రీసింహాపై నటుడు నాని ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో ఈ మూవీ గుర్తుండిపోతుందన్నారు. “శ్రీసింహా నాకు బాగా తెలుసు. రాజమౌళి ఫ్యామిలీ సినిమాకు సంబంధించిన పలు విభాగాల్లో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. శ్రీసింహా కూడా ఒక పెద్ద విభాగాన్ని ఎంచుకున్నారు. తను కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నాను. హీరోయిన్ కావ్య మంచి సినిమాలను ఎంచుకుంటుంది. ‘ఉస్తాద్’ చిత్ర బృందం నమ్మకాన్ని వమ్ముచేయదని నమ్ముతున్నాను” అని చెప్పారు.
ఈ సినిమా కథ అందరికీ కనెక్ట్ అవుతుంది- ఫణిదీప్
ఈ సినిమా కథ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దర్శకుడు ఫణిదీప్ తెలిపారు. మనుషులతో పాటు వస్తువుల్లోనూ ఉస్తాద్ లు ఉంటాయన్నారు. అలాంటి ఓ వస్తువుతో కలిసి ఓ అబ్బాయి చేసే ప్రయాణమే ఈ సినిమా కథ అని చెప్పారు. కలలు కనడమేకాదు, ఆ కలలను నెరవేర్చుకునేందుకు ఓ అబ్బాయి పడే తపనను సినిమాగా తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ వేడుకలో కాలభైరవ, రెహమాన్, రవీంద్ర విజయ్, ప్రియాంక వీరబోయిన సహా పలువురు నటీనటులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఆమేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial