Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Vangaveeti Mohana Ranga | దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ రాజకీయాల్లోకి వచ్చారు. రంగా ఆశయ సాధన కోసం కృచేస్తానని విజయవాడ వేదికగా ఆమె ప్రకటించారు.

విజయవాడ: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో ప్రముఖ నేత కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె మరెవరో కాదు దివంగత వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. విజయవాడలో ఆదివారం నాడు తన తండ్రి వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు తాను ఇకపై కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని తెలిపారు. తన తండ్రి రంగా ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ పూరిస్తా..
కొంతకాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆశా కిరణ్, ఇకపై తన ప్రయాణం పూర్తిగా బహిరంగంగా, ప్రజల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కులం, మతం భేదం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి తన తండ్రి రంగా అని ఆమె అన్నారు. ప్రస్తుతం రాధా రంగా మిత్రా మండలి మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించడానికి తాను వస్తున్నానని ఆశా కిరణ్ స్పష్టం చేశారు.
బలమైన నేతగా ఎదిగిన మోహనరంగా..
వంగవీటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆయన పూర్తి పేరు వంగవీటి మోహన రంగా రావు. 1980లలో ఆయన కాపు సామాజిక వర్గ నాయకుడిగా విజయవాడ ప్రాంతంలో బలమైన రాజకీయ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలకంగా పనిచేసిన రంగా, 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వంగవీటి దారుణహత్యతో అల్లర్లు..
రంగా జీవితం రాజకీయాలు ప్రత్యర్థులతో పాత కక్షలు, ఘర్షణలతో నిండి పోయింది. 1988లో టీడీపీ హయాంలో ఆయన హత్యకు గురి కావడం అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద అలజడి సృష్టించింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లకు దారితీసి, విజయవాడలో హింసాత్మక వాతావరణానికి కారణమైంది. రంగాను ఆయన అనుచరులు కాపు సామాజిక వర్గం నాయకుడిగా, ప్రజా పోరాట యోధుడిగా భావిస్తారు. రాధా-రంగా మిత్ర మండలి వంటి సంస్థలు ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
వంగవీటి కుమారుడి పాలిటిక్స్..
వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. రాధాకృష్ణ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. తరువాత ఎన్నికల్లో టికెట్ దక్కలేదని టీడీపీలో చేరారు. తరువాత అంత యాక్టివ్‌గా లేరు.






















