Onion Crop: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు, కానీ అది కూడా వారిని ఆగం చేసింది!
Onion Crop: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. కానీ గిట్టుబాట ధర లేకపోవడంతో వాటిని మార్కెట్లకు తీసుకెళ్లడం కూడా దండగే అనుకున్నారు. ఇంకేముంది పండించిన చేనులోనే పంటను దున్ని నాశనం చేశారు.
Onion Crop: కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని సింగాపురానికి చెందిన మహదేవ్, వెంటకేష్ లు ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ఉల్లి వేసి పంట కూడా పండించారు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి పంటను పండించిన పొలంలోనే దున్నేశారు. ఐదు ఎకరాలకు మూడు లక్షల 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు మార్కేట్ లో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కిలోకు 10 రూపాయలు మాత్రమే ఉండటంతో చాలా నష్టపోతున్నామని.. కనీసం పెట్టబుడి డబ్బులు కూడా రావట్లేదని రైతులు వివరిస్తున్నారు.
కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని తవ్వి, మార్కెట్లకు తీసుకు రావడం కంటే పొలంలో దున్నేయడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసి లోడు తీసేసరికి దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు.
ఏపీలో ఉల్లి పరిస్థితి ఇదీ...!
రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలు జిల్లాలోనే ఉల్లిని సాగు చేస్తుంటారు. ఉల్లిగడ్డ అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్నూల్ లోని ఉల్లిగడ్డే. దేశీయ మార్కెట్లో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. కర్నూల్ కరువు జిల్లానే అయినప్పటికీ.. ఎక్కువ మంది రైతులు ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా ఉల్లిని సాగు చేస్తుంటారు. సామాన్య మధ్య తరగతికి చెందిన రైతులను కూడా ఉల్లి.. కోటీశ్వరులను చేసింది. అలాగే చాలా మంది రైతులు మరింత పేదలుగా మారేందుకు కారణం అయింది.
దేశవ్యాప్తంగా ఉల్లి పరిస్థితి..
దేశ వ్యాప్తంగా ఉల్లిని ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అయితే అక్కడ పండే ఉల్లి నాణ్యత, రంగు, పరిణాణంలో ప్రత్యేకతను కల్గి ఉంటుంది. కాబట్టి వాటిని దేశీయంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలలో సాధారణంగా మన దేశంలో ఉండే ధర కంటే నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. అయితే మార్కెట్లో మహారాష్ట్ర ఉల్లి ఉంటే వాటి ప్రభావం కారణంగా.. తెలుగు రాష్ట్రాలలో పండుతున్న ఉల్లి ధర పతనమై రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ఉల్లికి గిరాకి ఎప్పుడు, ఎలా...?
ఉత్తర భారతదేశంలో ఋతు పవనాల కారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో పంటంతా పాడవుతుంది. అలాంటి సమయాల్లో తెలుగు రాష్ట్రాలలో ఉల్లికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా ఉల్లి ధరలు రెట్టింపై.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వంటి కొన్ని అంశాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు దళారులు, మరోవైపు ఉల్లికి కుళ్లిపోయే స్వభావం ఉండడం వల్లనే ఎక్కువ నష్టాలు వస్తున్నాయని వివరిస్తున్నారు.
ఎన్ని ప్రభుత్వాలొచ్చినా మారని పరిస్థితి..
భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం చేదని చెప్పడమే తప్ప.. వారికి ఏ ప్రభుత్వాలు సాయం చేసిన దాఖలాలు లేవు. రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఒక్క రైతు పండించిన పంట ధర మాత్రమే పెరగడం లేదు. చాలా మంది రైతులు, కౌలు రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర లేక.. నష్టాల పాలై ఆత్మహత్యలు చేస్కున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితి మారిన నాడే అన్నదాతల బతుకులు గాడిలో పడతాయని అన్నదాతలు చెబుతున్నారు.