విదుర నీతి: ఈ లక్షణాలు లేనివాడు నాయకుడే కాదు!
విదురుడు వేల సంవత్సరాల క్రితమే సమాజానికి అవసరమయ్యే అనేక విషయాలను గురించి విదుర నీతిలో వివరించాడు. వాటిలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను గురించి చాలా స్పష్టంగా వివరించాడు.
విదురుడు దృతరాష్ట్రునికి తమ్ముడు మాత్రమే కాదు హస్తినాపురానికి మంత్రి కూడా. మంత్రిగా రాజుకు తాను ఇవ్వ దగిన సలహాలు ఎప్పటికప్పుడు అటు దుర్యోధనుడికి, ఇటు దృతరాష్ట్రుడికి ఇస్తునే వచ్చాడు. కానీ అతడి మాటలు పెడచెవిన పెట్టిన హస్తినాపురం పెద్దలు కురుక్షేత్ర యుద్ధం వరకు విషయం వచ్చిన తర్వాత దృతరాష్ట్రుడికి నిద్రపట్టని రోజులు వచ్చాయి. అప్పుడు విదురుడు చెప్పిన మంచి మాటలే విదుర నీతిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఉద్యోగ పర్వంలోని భాగం. ఇక్కడ విదురుడు చెప్పిన మాటలు దృతరాష్టుడికే అయినా ప్రపంచమంతా ఆచరించదగినవి. ఈ లక్షణాలు లేనివాడు.. అస్సలు నాయకుడే కాదనేది విదురుడి అభిప్రాయం. మరి, నాయకుడికి ఉండాల్సిన ఆ లక్షణాలేమిటో చూసేయండి.
- నాయకత్వం వహించే వాడు అందరి శ్రేయస్సును కాంక్షించాలి. అందరినీ సమానంగా చూడగలగాలి. ఏ ఒక్క సమూహానికి దుఃఖం కలిగించినా అతడు నాయకుడిగా విఫలమైనట్టే.
- తనను అనుసరిస్తున్న వారి కష్టాల్లో, ఆపదల్లో వారిపట్ల శ్రద్ధ చూపాలి. బాధ చిన్నదైనా, పెద్దదైనా తనపై ఆధారపడిన వారి ఇబ్బందులు తన దృష్టికి వచ్చినపుడు నిర్లక్ష్యం చెయ్యడం, విస్మరించడం చెయ్య కూడదు.
- నాయకుడు సకల జీవరాశి పట్ల కనికరం కలిగి ఉండాలి. కేవలం తాను ఉపయోగించకుంటున్న జీవులను మాత్రమే చూసుకోవడం కాదు తన చుట్టూ ఉన్న అన్ని జీవుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. వీలైనంత వరకు నష్టం జరగకుండా నడుచుకోవాలి.
- నాయకుడైన వాడు తన అనుచరగణం నిర్వహించే వ్యవసాయం, ఇతర ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి మరియు పెరుగుదలను ఎవ్వరూ అడ్డుకోకుండా కాపాడుకోవాలి.
- అనుచరులలో భద్రత కోసం తనపై ఆధారపడిన వారిని రక్షించడానికి అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. భద్రత కల్పించలేని వాడిని నాయకుడుగా భావించడం వృథా.
- నాయకుడు ఎప్పుడూ న్యాయంగా, నిజాయితీగా నడచుకోవాలి. తన వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలి. ధర్మబద్ధంగా విజయం సాధించాలి. ఆ విజయాన్ని ధర్మబద్ధంగా నిలబెట్టుకోవాలి.
- నాయకుడు తన అనుచరుల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావించాలి.
- నిరంతరం జ్ఞాన సముపార్జన చేసేవాడే నిజమైన నాయకుడు. నిరంతం నేర్చుకోవడం నేర్చుకున్నజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలి. విజ్ఞాన వంతులు తన వారిలో ఉంటే వారిని ప్రోత్సహించడంలో వెనుకాడ కూడదు.
- ధర్మ బద్ధమైన జీవితాన్ని గడపాలి. తన అనుచరగణం శ్రేయస్సు అతడి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కనుక నాయకుడు విజ్ఞుడై ఉండాలి.
- చెడు స్నేహానికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ విజ్ఞులు, ఉత్తములైన వారి స్నేహాన్ని మాత్రమే కోరుకోవాలి.
- ఎప్పుడూ సంపదను దుర్వినియోగం చేయకూడదు, పరుషంగా, కఠినంగా మాట్లాడకూడదు. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉన్నప్పటికీ తీవ్రమైన లేదా క్రూరమైన శిక్షలు విధించకూడదు.
ఇలా ఈ పదకొండు లక్షణాలు తప్పకుండా కలిగి ఉండిలి. అప్పుడే ఉత్తమ నాయకుడుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి.
Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!