Yama Dwitiya 2022: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!
కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే ఈ వేడుకను 'యమవిదియ', 'యమ ద్వితీయ', భగినీ హస్త భోజనం అంటారు. ఈ రోజు సోదరులను స్వయంగా ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి, కానుకలిస్తారు సోదరీమణులు. ప్రత్యేకత ఏంటంటే..
Yama Dwitiya 2022:సోదరి, సోదరుల పండుగ అనగానే 'రాఖీ' అని ఠక్కున గుర్తొస్తుంది. కానీ పురాణకాలం నుంచి సోదరి, సోదరుల పండుగల్లో విశిష్టమైనది 'భగినీ హస్త భోజనం'. భగిని అంటే సోదరి..ఆమె పెట్టే భోజనం కనుకే భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే కార్తీకమాసంలో రెండో రోజు ఇది జరుపుకుంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే రాఖీ తో సమానమైన పండుగన్నమాట. అయితే రక్షాబంధనం రోజు అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు చూస్తామని, ఎల్లవేళలా రక్షిస్తామని మాటిస్తారు. ఆ సోదరుడి ఆరోగ్యం, ఆయుష్షుని కాంక్షిస్తూ సోదరీమణులు ఈ వేడుక నిర్వహిస్తారు. "భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరభారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వేడుక ఇది.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
యమద్వితీయ పురాణ కథనం
యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని ఇంటికి ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు. ఒకసారి కార్తీక మాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలు యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని ఎంతో సంతోషించిన యమున పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ ఆనందంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అయితే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన ఈ రోజున ఎవరైతే అక్కచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో వాళ్లకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. సంతోషించిన యముడు....తాను సోదరి ఇంట్లో భోజనం చేసిన కార్తీకమాసంలో విదియ రోజు ఎవరైతే సోదరీమణుల చేతి భోజనం తింటారో వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుందని... ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరమిచ్చాడు యముడు.
Also Read: దీపావళికి ఈ చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!
నోట్: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని మీరు ఎంతవరకూ విశ్వసిస్తారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం