చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఓ ఒంటరి ఏనుగు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గంటవూరు జాతీయ రహదారి పక్కనే రాత్రి పూట సంచరిస్తోంది. అక్కడే ఉన్న గోడను ధ్వంసం చేసి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పంటను నాశనం చేసింది. గత వారం రోజుల నుంచి మొగిలి, గౌరీశంకరపురం, మొగలివారిపల్లి, టేకుమంద మామిడికుంట గ్రామాల్లో రైతులను ముప్ప తిప్పలు పెడుతోంది ఈ ఏనుగు. ఇప్పటికే అటవీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే..ఏనుగు ఎప్పుడు తమపై దాడి చేస్తుందో అని స్థానికులు హడలిపోతున్నారు. పంట పొలాలపై దాడులు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అయితే... జనావాసాల్లోకి వస్తుండడం వల్ల అటవీ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వీలైనంత త్వరగా ఏనుగును పట్టుకుని అడవిలో వదిలేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు గ్రామస్థుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం వల్ల అప్రమత్తమయ్యారు. పంట పొలాలు ధ్వంసం చేయడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.