Mental Health: బ్రేకప్ అయ్యాక మానసికంగా కుంగిపోయారా? ఇలా బయటపడండి
బ్రేకప్ బాధను తట్టుకోలేక మానసికంగా కుండిపోయేవాళ్లకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు మానసిక నిపుణులు.
ప్రేమ విఫలం చెంది ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం, మానసికంగా కుంగి డిప్రెషన్ బారిన పడుతుంటారు. సర్వం కోల్పోయినట్టు, ఇక జీవితం లేనట్టు ఫీలవుతుంటారు. నిజానికి బ్రేకప్ అనేది పెద్ద విషయం కాదు, జీవితంలో చిన్న ఘట్టం బ్రేకప్. ఇంకా చెప్పాలంటే పెద్ద పుస్తకంలో ఒక పేజీ మాత్రమే బ్రేకప్ అనేది. దాని కోసం జీవితాన్నే కోల్పోయేలా చేసుకోకూడదు. మానసిక అనారోగ్యాలు తెచ్చుకుని బలహీనంగా మారి తద్వారా గుండె జబ్బులు, మెదడు సమస్యలు వచ్చేలా చేసుకోవడం మంచి పద్ధతి కాదు.
ప్రేమలో పడటం సులువే, కానీ బ్రేకప్ చెప్పుకోవడం చాలా కష్టం. ప్రేమలో పడ్డాక ఆనందాన్ని కలిగించే రసాయనాలు, హార్మోన్లు విడుదలవుతాయి. కానీ బ్రేకప్ అయ్యాక మాత్రం భావోద్వేగాలు ఎక్కువైపోతాయి. ఒత్తిడి హార్మోన్లు విడుదలై భారంగా అనిపిస్తుంది. ఒక్కోసారి గుండెపోటు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దీన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. ఇది బ్రేకప్ అయిన చాలా మందిలో కనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలనిపించడం, విచారంగా ఉండడం, చిరాకు, ఆకలి వేయకపోవడం, నిద్రపట్టక పోవడం వంటి సమస్యలతో వీరు బాధపడతారు. బ్రేకప్ అయ్యాక ఆ బాధ నుంచి తేరుకుని జీవిత ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మీకు ఉంది. బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలో మానసిక నిపుణులు చెబుతున్నారు.
విచారాన్ని అధిగమించాలి...
ఏ బాధ కలిగిన మూడీగా మారిపోవడం సహజం. ఇక బ్రేకప్ బాధ నేరుగా గుండెను మెలితిప్పినట్టు అవుతుంది. అందుకే డల్ గా అయిపోతారు. మీ భావాలకు, ప్రేమకు విలువివ్వడం మంచిదే, అలాగే మీ జీవితానికి, మీ కుటుంబసభ్యులకు కూడా అంతే విలువివ్వాలి. విచారం నుంచి బయటికి వచ్చి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. బ్రేకప్ చెప్పి మిమ్మల్ని వదిలి వెళ్లిన వారు వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టే మీరు కూడా చేయాలి. ఇందుకోసం కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త స్నేహితులను చేసుకోవడం ద్వారా కాస్త ఆ బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.
హద్దులు అవసరం
సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే నిరుత్సాహం తప్ప ఇంకేమీ కలగదు. కాబట్టి మీకు ఇష్టమైన వ్యాపకాల వైపు ఆలోచించండి. మీరు బాగా ఇష్టపడే పనులే చేయండి. మీకు నచ్చిన ఆహారాన్ని తినండి. ప్రతి దానికి హద్దు ఉంటుంది. అలాగే బ్రేకప్ బాధకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి బాధను బయటికి రానివ్వకండి.
ఒత్తిడి వద్దు
బ్రేకప్ అనేది ఆత్మ గౌరవానికి సంబంధించినది. ఇది ఒత్తిడి, నిరాశకు గురిచేస్తుంది. ఏదో తప్పు చేశానన్న భావనను పెంచేస్తుంది. కానీ తప్పు మీ ఒక్కరి వల్లే జరగిందనుకోవద్దు. ఒత్తిడి ఛాయలు పడకుండా చూసుకోండి.
ఒంటరిగా ఉండొద్దు
బ్రేకప్ అయ్యాక మీరు ఒంటరిగా ఉండొద్దు. కుటుంబసభ్యులతో ఉండాలనిపించకపోతే స్నేహితులతో ఉండండి. ఆ బాధ నుంచి బయటపడే వరకు ఎవరో ఒకరితో కలిసే ఉండండి కానీ ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉంటే మాత్రం ఓటీటీ లవ్ సినిమాలు కాకుండా, థ్రిల్లింగ్ సినిమాలు చూడండి.
ధ్యానం చేసుకోండి
రోజూ కాసేపు ధ్యానం చేస్తే చాలా మంచిది. శ్వాస మీద దృష్టి ఉంచే వ్యాయామాలు చేయాలి. ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ప్రాణాయామం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.
Also read: ఉల్లిపాయ తొక్కలు పడేయకుండా పొడి చేసి దాచుకుంటే వంటల్లో ఇలా వాడుకోవచ్చు
Also read: రాత్రిపూట ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.