ఉల్లిపాయ తొక్కలు పడేయకుండా పొడి చేసి దాచుకుంటే వంటల్లో ఇలా వాడుకోవచ్చు
ఉల్లిపాయ తొక్కలు పడేసే వాళ్లే ఎక్కువ మంది కానీ వాటితో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
ఉల్లిపాయలు తొక్కల ఉపయోగాలు చాలా తక్కువ మందికి తెలుస. దాదాపు అందరూ వాటిని బయటపడేస్తారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మాత్రం దాచుకుంటారు. వాటిని పొడి చేసి ఓ డబ్బాలో దాచుకుని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయ తొక్కలు ఎన్నో పోషకాలకు మూలం. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంతో పాటూ ఎన్నో రకాలుగా శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే చర్మానికి ఎంతో అవసరమైన విటమిన్ సి, ఇ కూడా ఇందులో ఉన్నాయి.అందుకే ఉల్లిపాయ తొక్కలను వంటల్లో ఎలా భాగం చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాం.
ఇగురులా వచ్చేలా
పులుసు, వేపుళ్ల కన్నా ఇగురును ఇష్టపడేవాళ్లు ఎంతోమంది. రొయ్యల ఇగురు, చేపల ఇగురు, బంగాళాదుంప ఇగురు కూడా వండుతున్నప్పుడు గ్రేవీ చిక్కగా వచ్చేందుకు ఉలిపాయల పొడి కలపవచ్చు.ఇది కూరకు మంచి రంగును ఇస్తుంది. పొడి లేని వారు నేరుగా తొక్కలు వేసేయచ్చు. రెండు నిమిషాల ఉడికాక వాటిని తీసి బయటపడేయాలి.
ఉల్లిపాయ తొక్కల టీ
ఉల్లిపాయ తొక్కలతో టీ కూడా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీ తాగడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కప్పులో వేడినీళ్లు పోసి ఉల్లిపాయ తొక్కలు లేదా ఉల్లిపాయ పొడి వేసి కలుపుకోవాలి. కాసేపు వేడి మీద ఉడికించాక తొక్కలను తీసి బయటపడేయాలి. పొడి కలిపితే వడకట్టుకుని టీని తాగేయడమే.
నీటిలో కలుపుకుని
ఉల్లిపాయ పొడిని నీటిలో కలుపుకుని కాసేపు నానబెట్టాక తాగేయాలి. ఇలా చేయడం వల్ల కండరాల తిమ్మిరి వంటివి తగ్గుతాయి. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. అదే ఉల్లిపాయ తొక్కలైతే గ్లాసు నీటిలో పావు గంటసేపు నానబెట్టి, తరువాత ఆ తొక్కలు తీసి తాగేయాలి. ఇది కషాయం లాంటిది.
అన్నంలో
అన్నం వండేటప్పుడు ఉల్లిపాయ తొక్కలను లేదా ఉల్లిపాయ పొడిని జోడించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
చపాతీలలో
ఇంట్లో చపాతీలు చేస్తున్నారా... అయితే ఆ పిండి కలిపేటప్పుడు ఉల్లిపాయ పొడిని కాస్త కలిపితే కొత్త రుచి వస్తుంది. కర్రీతో ఆ చపాతీని తింటుంటే మంచి రుచి కూడా వస్తుంది.
Also read: రాత్రిపూట ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువే
Also read: అధికంగా ఉడికించడం వల్ల కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయా? ఇందులో నిజమెంత?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.