Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్ వందేళ్లు పూర్తి చేసుకుంది. వందేళ్లుగా ప్రజల దినచర్యలో భాగమైన ఇది క్యాలెండర్ మాత్రమే తెలుగువాడి ఎమోషన్‌గా మారింది.

Venkatrama and Co Calendar : న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రజల ఇళ్లల్లో గోడకు వెంకట్రామా అండ్ కో క్యాలెండర్ వేలాడాల్సిందే. అంతలా ఆ సంస్థ వాళ్ళు పబ్లిష్ చేసే క్యాలెండర్ పాపులర్ అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే వెంకట్రామా & కో క్యాలెండరు, వెంకట్రామా &కో ఎక్కాల పుస్తకం తెలుగు వారికి ఒక ఎమోషన్‌గా మారిపోయాయి. ఈదర వెంకట్రావు పంతులు గారు 1927లో స్థాపించిన వెంకట్రామ &కో ఈ ఏడాది 100వ ఏట అడుగుపెడుతోంది.
మూడు తరాలుగా సంస్థను నడిపిస్తున్న ఈదర కుటుంబం.. ఇప్పుడు నాలుగో తరం రెడీ
ప్రస్తుతం వెంకట్రామ అండ్ కో సంస్థను ఈదర కుటుంబంలోని మూడోతరం నడిపిస్తోంది. ఈదర వెంకట రమణ ప్రసాద్ ఆ కుటుంబం పెద్దగా వ్యవహరిస్తుండగా ఆయనకు చేదోడుగా ఆయన సతీమణి సరస్వతి ఉన్నారు. సరిగ్గా వందేళ్ల క్రితం 1927లో ఈదర వెంకట్రావు పంతులు తొలిసారి క్యాలెండరు ఏలూరులో పబ్లిష్ చేశారు. అప్పటికి ఆంగ్ల క్యాలెండర్ విడిగా, తెలుగు పంచాంగం వేరుగా పబ్లిష్ అవుతూ ఉండేవి. ఈ రెండిటినీ కలిపి వెంకట్రావు పంతులు వెంకట్రామా &కో క్యాలెండర్ పబ్లిష్ చేయడంతో అది వెంటనే పాపులర్ అయిపోయింది. అటు బ్రిటిషర్స్, ఇటు తెలుగు ప్రజానీకానికీ ఇద్దరికీ ఈ క్యాలెండర్, దాని ఫాంట్ విపరీతంగా నచ్చేసాయి. ఈదర వెంకట్రావు పంతులు తరువాత ఆయన కుమారుడు ఈదర వెంకట్రాయ్య ఈ క్యాలెండర్ పబ్లిష్ చేయడాన్ని కంటిన్యూ చేశారు.
వెంకట్రామయ్య కుమారుడు వెంకట రమణ ప్రసాద్ ప్రస్తుతం, సరస్వతి దంపతులు ఈ క్యాలెండర్ పబ్లిష్ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారి కుమారుడు ఈదర వెంకట రామారావు త్వరలోనే నాలుగో తరం పబ్లిషర్‌గా వెంకట్రామా అండ్ కో క్యాలెండర్ బాధ్యతలు చేపట్టనున్నారని వెంకట రమణ ప్రసాద్ తెలిపారు. తామంతా వెంకటేశ్వర స్వామి భక్తులు కావడం వల్ల తమ వంశంలో అందరి పేర్లు 'వెంకట'అనే పదంతోనే ప్రారంభం అవుతాయని ఆయన చెప్పుకొచ్చారు.
తెలుగు వారి ఎమోషన్ వెంకట్రామా & కో
ప్రతీ సంవత్సరం అక్టోబర్ నెలనుంచే రాబోయే సంవత్సరం క్యాలెండర్ పబ్లిష్ చేస్తారు. కేవలం తెలుగు ప్రాంతాలే కాకుండా తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక మొదలు దేశ విదేశాల్లో నివసించే తెలుగు వారి నుంచి ఈ క్యాలెండర్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కేవలం తమ ఇళ్లలో తగిలించడమే కాకుండా తెలిసిన వాళ్లకు గిఫ్ట్ గా కూడా ఈ క్యాలెండర్ ను ఇస్తూ ఉంటారు. క్యాలెండర్ మాత్రమే కాకుండా వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకాన్ని కూడా ప్రింట్ చేస్తుంది ఈ సంస్థ. అది కూడా చాలా పాపులర్. EVV సత్యనారాయణ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు తమ సినిమాల్లో వీటి పేరును వాడిన సందర్భాలు బోలెడు. ఇవికాక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పుస్తకాలను కూడా వీరు ప్రింట్ చేసిన చరిత్ర ఉంది. ఇక ఆధ్యాత్మిక పుస్తకాలు అయితే కోకొల్లలు.
ఏలూరులో 'ఈదర ' కుటుంబం.. ఒక బ్రాండ్
మొదటి నుంచీ ఆర్థికంగా లోటు లేని కుటుంబం కావడంతో క్యాలెండర్, పుస్తకాలు పబ్లిష్ చేయండంతో వచ్చే ఆదాయాన్ని దాన ధర్మాలకు కేటాయించేవారు ఈ కుటుంబ సభ్యులు. ఏలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. శంకర మఠం, కళా కేంద్రం వంటి నిర్వహణతోపాటు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గతంలో వీరు వెంకట్రామా అనే సినిమా హాల్ కూడా నిర్మించారు. ఈ మధ్య దానిని అపార్ట్‌మెంట్స్ గా మార్చేశారు. ఇప్పటికీ ఆ సెంటర్ పేరు "వెంకట్రామా" అనే పిలుస్తారు. అలాగే వెంకటరమణ ప్రసాద్ కుటుంబం ఉంటున్న వీధికి "ఈదర స్ట్రీట్"అని పేరు.
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబంతో ఈదర వెంకట్రావు పంతులు కుటుంబానికి బంధుత్వం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య వీరికి సన్నిహితులు. కానీ ఎప్పుడూ రాజకీయాల లోనికి వెళ్లే ప్రయత్నం చేయలేదు ఈ కుటుంబం. ప్రస్తుతం జెనరేషన్ మారిపోయినా "డిజిటల్ రూపంలోనైనా వెంకట్రామా & కో క్యాలెండర్ ముద్రిస్తూనే ఉంటాం తప్ప ఆపేది లేదు" అని వెంకట రమణ ప్రసాద్ , సరస్వతి దంపతులు తెలిపారు.





















