Minu Muneer: ఆ నటుడు నన్ను వెనుక నుంచి వాటేసుకున్నాడు, మరొకరు రూమ్‌కు పిలిచి..: నటి మిను మునీర్
కొంత మంది వేధింపుల కారణంగా మలయాళీ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని నటి మిను మునీర్ ఆరోపించారు. హేమ కమిటీ రిపోర్టు నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Malayalam Actor Minu Muneer Aleges Sexual Abuse: మలయాళీ సినీ ఇండస్ట్రీలో మహిళలపై తీవ్ర వేధింపులు కొనసాగుతున్నాయంటూ జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో.. పలువురు బాధిత నటీమణులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్ తనను లైంగికంగా వేధించాడని బెంగాలీ నటి ఆరోపణలు చేయడంతో ఆయన కేరళ సినీ అకాడమీ ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేశారు. నటి రేవతి సంపత్ ఆరోపణల నేపథ్యంలో నటుడు సిద్ధిఖీ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా నటి మిను మునీర్ సైతం తనకు ఎదురైన లైంగిక, మానసిక వేధింపుల గురించి వెల్లడించింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులతో పాటు ఇతర ప్రముఖుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈమేరకు ఫేస్ బుక్ వేదికగా తన బాధను చెప్పుకొచ్చింది.
ఇంతకీ మిను మునీర్ ను వేధించిన వాళ్లు ఎవరంటే?
మలయాళీ నటుడు జయసూర్య, ముఖేష్, మణియన్ పిళ్ల రాజు, ఇడవేల బాబుతో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేశారని మిను మునీర్ చెప్పుకొచ్చింది. “జయసూర్య, ముఖేష్, మణియన్ పిళ్ల రాజు, ఇడవేల బాబు, నోబల్, విచు నుంచి పలురకాల వేధింపులు ఎదుర్కొన్నాను. ఓ సినిమా షూటింగ్ సమయంలో నేను టాయలెట్ కు వెళ్లి బయటకు రాగానే జయసూర్య నన్ను వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. నేను షాక్ కి గురయ్యాను. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఇడవేల బాబును మెంబర్ షిప్ కోసం సంప్రదించాను. మెంబర్ షిప్ ఇస్తానని చెప్పి ఫ్లాట్ కు పిలిచి శారీరకంగా వేధించాడు. అధికార సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అయిన నటుడు ముఖేష్ తన అడ్వాన్సులను తిరస్కరించిన మెంబర్ షిప్ కూడా ఇవ్వలేదు. మలయాళీ ఇండస్ట్రీలో శారీరక, శ్రమ దోపిడీ ఉంది. దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. 2013లో ఓ సినిమా చేస్తున్నప్పుడు వీరి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమా కోసం వారి వేధింపులను కొద్ది రోజులు తట్టుకున్నాను. కానీ, లైంగికంగా, మానసికంగా వారి టార్చర్ ఎక్కువైంది. చివరకు వారి వేధింపులను తట్టుకోలేకపోయాను. మలయాళీ ఇండస్ట్రీలనే వదిలేశాను. చెన్నైకి వచ్చేశాను. కానీ, వారి కారణంగా నేను మానసికంగా నలిగిపోయాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వారి చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నారు. వీరి టార్చర్ ను గతంలోనే కొన్ని పత్రికలతో చెప్పాను. కానీ, అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హేమ కమిటీ రిపోర్టు ఇలాంటి వారి బండారాన్ని బయటపెట్టడం సంతోషంగా ఉంది” అని మిను చెప్పుకొచ్చింది.
ఆరోపణలను ఖండించిన మణియం పిళ్ల రాజు
అటు మిను మునీర్ ఆరోపణలను నటుడు మణియం పిళ్ల రాజు ఖండించారు. ఆమె ఆరోపణల వెనుక ఏవో స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. "కొంతమంది పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిందితులలో అమాయకులు, దోషులు ఇద్దరూ ఉంటారు. పూర్తి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు బయటకు వస్తాయి” అన్నారు.
ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు
మహిళా నటుల ఇబ్బందుల గురించి రోజు రోజు మరిన్ని ఘటనలు బయటకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: భయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!