Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Titanic movie producer death: హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ‘టైటానిక్’, ’అవతార్’ చిత్రాల నిర్మాత జోన్ లాండౌ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ తో చికిత్సపొందుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు.
Titanic and Avatar Producer Jon Landau Dies Aged 63: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జోన్ లాండౌ కన్ను మూశారు. 63 ఏండ్ల వయసు ఉన్న ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. హాస్పిటల్ లో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయారు. జూలై 5నే ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.
హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాతగా గుర్తింపు
జోన్ లాండౌ హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన నిర్మించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నాయి. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తో కలిసి ‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి చిత్రాలను నిర్మించారు. జేమ్స్ కామెరూన్, లాండౌ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టాయి. 1997లో వచ్చిన ‘టైటానిక్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘అవతార్‘, దానికి సీక్వెల్ గా వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ హాలీవుడ్ లో కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి.
గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన లాండౌ చిత్రాలు
జోన్ లాండౌ 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా సినీ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. పలు హాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. ‘టైటానిక్’ ఘటనను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన ఆయన మదిలో నుంచి వచ్చినదే. 1912లో టైటానిక్ ఓడ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రయాణీకులు చనిపోయారు. ఈ ఘటనను బేస్ చేసుకుని సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని కామెరూన్ తో చెప్పారు. ఇద్దరు కలిసి ‘టైటానిక్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. 1997లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. అప్పట్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 వేల కోట్లు సాధించింది. ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుని సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత లాండౌ నిర్మాణంలో 2009లో విడుదలైన ‘అవతార్’.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24 వేల కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన ‘అవతార్ 2’ కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 19 వేల కోట్లు అందుకుంది.
జోన్ లాండౌ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం
నిర్మాత జోన్ లాండౌకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య పేరు జూలీ కాగా, కొడుకులు జామీ, జోడీ. ఆయనకు ఇద్దరు సిస్టర్స్, ఓ బ్రదర్ ఉన్నారు. లాండౌ నిర్మించిన అవతార్ సిరీస్ మూడో భాగం 2026లో, నాలుగో భాగం 2030లో విడుదలకానుంది. జోన్ లాండౌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటున్నారు.
Also Read: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు