Airtel Jio Starlink Deal: అప్పుడు 'వద్దు', ఇప్పుడు 'ముద్దు' - ఎయిర్‌టెల్, జియోకు స్టార్‌లింక్ ఎందుకు అవసరం?
Airtel Jio SpaceX Deal: స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం దిగ్గజాలు అప్పుడు దీనిని గట్టిగా వ్యతిరేకించాయి.

Airtel-Jio SpaceX Agreement: భారతదేశ డిజిటల్ వ్యవస్థలో మరో పెనుమార్పును త్వరలో మనం చూడబోతున్నాం. భారతదేశంలో 'స్టార్‌లింక్' ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను (Starlink satellite internet services) ప్రారంభించడానికి భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel), ఎలాన్ మస్క్ (Elon Musk) కంపెనీ స్పేస్‌ఎక్స్ (SpaceX)తో చేతులు కలిపింది. ఇది జరిగిన ఒక్కరోజు వ్యవధిలో, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (JIO Platforms) కూడా స్టార్‌లింక్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. ఒకప్పుడు, భారతదేశంలోకి స్టార్‌లింక్ ఎంట్రీని వ్యతిరేకించిన ఈ రెండు కంపెనీలు, ఇప్పుడు అదే సంస్థతో కలిసి వ్యాపారం చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటి?.
స్టార్‌లింక్ 2022 అక్టోబర్ నుంచి భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్ మొదట్లో దీనిని వ్యతిరేకించాయి. వాస్తవానికి, భారత ప్రభుత్వం ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని నిర్ణయించింది & దీనిని జియో, ఎయిర్‌టెల్ విభేదించాయి. స్పెక్ట్రమ్ కేటాయింపును వేలం వేయాలని జియో వాదించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న పద్ధతులను దృష్టిలో పెట్టుకుని, స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని టెలికాం కంపెనీల మాదిరిగానే శాటిలైట్ కంపెనీలు కూడా స్పెక్ట్రమ్ కొనుగోలు చేసి లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్ చెప్పారు, దీనికి జియో కూడా మద్దతు ఇచ్చింది. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్, ఇలాగైతే స్టార్‌లింక్ భారతదేశంలో లాంచ్ చేయడం "చాలా కష్టం" అని కామెంట్ చేశారు.
స్టార్‌లింక్‌తో జియో, ఎయిర్‌టెల్ ఒప్పందం
ప్రారంభ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇప్పుడు, జియో & ఎయిర్‌టెల్ రెండూ స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. స్పేస్‌ఎక్స్‌తో జరిగిన ఒప్పందంపై మంగళవారం నాడు ఎయిర్‌టెల్, బుధవారం నాడు జియో ప్రకటనలు చేశాయి. ఈ చర్య, ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలో ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీని కూడా సూచిస్తుంది.
జియో & ఎయిర్‌టెల్‌కు స్టార్‌లింక్ సేవలు ఎందుకు ముఖ్యం?
స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం వల్ల.. జియో & ఎయిర్‌టెల్‌కు భారతదేశంలోని గ్రామీణ, మారుమూల, కఠినమైన ప్రాంతాలలో కూడా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి వీలవుతుంది. డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన జియో - లో ఎర్త్ ఆర్బిటర్ శాటిలైట్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన స్టార్‌లింక్ మధ్య ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అదే సమయంలో, ఎయిర్‌టెల్ - స్పేస్‌ఎక్స్‌కు భారత మార్కెట్లో కొత్త అవకాశాలను అన్వేషించడానికి అవకాశం కల్పిస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన & ఎలాన్ మస్క్‌తో సమావేశం తర్వాత ఈ ఒప్పంద ప్రకటనలు వచ్చాయి. భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని దీనిని బట్టి స్పష్టమవుతోంది.
నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఇప్పుడు అందరి దృష్టి భారత ప్రభుత్వంపై ఉంది. ఎయిర్‌టెల్, జియోతో ఒప్పందాలు జరిగాయి గానీ, స్పేస్‌ఎక్స్‌కు ఇంకా పరిపాలన పరమైన అనుమతులు రాలేదు. అవసరమైన అనుమతి కోసం స్పేస్‌ఎక్స్ ఎదురు చూస్తోంది. ఇది ఆమోదం పొందిన తర్వాత, స్టార్‌లింక్ భారతదేశంలో తన సర్వీసులను ప్రారంభిస్తుంది. పట్టణ ప్రాంతాలతో పాటు దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సృష్టిస్తుంది.
ఉపగ్రహ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
ఉపగ్రహ ఇంటర్నెట్ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. 1. ఉపగ్రహం, 2. గ్రౌండ్ స్టేషన్, 3. వినియోగదారుడి పరికరం.
ఉపగ్రహాలు: ఈ ఇంటర్నెట్ టెక్నాలజీలో ఉపగ్రహం అతి ముఖ్యమైన భాగం. ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుంటాయి & వినియోగదారుడి పరికరానికి ఇంటర్నెట్ (డౌన్‌లోడ్, అప్‌లోడ్) అందిస్తాయి. పాత వ్యవస్థల జియో స్టేషనరీ ఆర్బిట్ (GEO)తో పోలిస్తే... స్టార్‌లింక్, కైపర్ వంటి కొత్త సాంకేతికతలు లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో పనిచేస్తాయి, ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి & లేటెన్సీ (ఆలస్యం) తగ్గిస్తాయి.
గ్రౌండ్ స్టేషన్: దీనిని గేట్‌వే అని కూడా పిలవొచ్చు. ఇది, ఇంటర్నెట్ డేటాను ఉపగ్రహానికి & ఉపగ్రహం నుంచి భూమికి ప్రసారం చేస్తుంది. ఇవి నేరుగా ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు అనుసంధానమై ఉంటాయి, డేటాను సరైన స్థలానికి పంపుతాయి.
వినియోగదారు పరికరాలు: సాధారణంగా, ఇంటర్నెట్ ఉపయోగించడానికి యూజర్‌కు ఉపగ్రహ యాంటెన్నా (డిష్), ట్రాన్స్‌సీవర్, మోడెమ్ అవసరం. ఈ వ్యవస్థ, యూజర్ ఇంటర్నెట్ పరికరాన్ని ఉపగ్రహానికి అనుసంధానిస్తుంది, యూజర్‌ను అనుక్షణం ఆన్‌లైన్‌లో ఉంచుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

