Retail inflation: దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం, మళ్లీ వడ్డీ రేట్ల బాదుడు భరించాల్సిందే!
6 శాతం కంటే ఎక్కువగా ఉండటం (ఆగస్టుతో కలిపి) వరుసగా ఇది 8వ నెల.
Retail inflation: మన దేశంలో ద్రవ్యోల్బణం (inflation) దడ పుట్టిస్తూనే ఉంది. గత మూడు నెలల పాటు కొద్దికొద్దిగా తగ్గిన వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఆగస్టులో జూలు విదిలించింది. 3 నెలల క్షీణతను తుడిచేసి, ఆగస్టులో 7%కి ఎగసిపడింది. ప్రధానంగా ఆహార ధరల పెరుగుదల కారణంగా ఈ జంప్ కనిపించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.79% నుంచి వరుసగా మూడు నెలల పాటు, జులై వరకు తగ్గుతూ వచ్చింది. జులైలో CPI నంబర్ 6.71 శాతంగా ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ (RBI) కంఫర్ట్ లెవెల్ 2-6 శాతం కంటే ఎక్కువగానే రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతోంది. ఇలా, 6 శాతం కంటే ఎక్కువగా ఉండటం (ఆగస్టుతో కలిపి) వరుసగా ఇది 8వ నెల.
2023 ప్రారంభం వరకు, ద్రవ్యోల్బణం దాని లక్ష్య శ్రేణిలోని టాప్ ఎండ్ 6 శాతం కంటే పైనే కొనసాగుతుందని RBI అంచనాల ప్రకారం కూడా చెబుతున్నాయి. అంటే, దేశవ్యాప్తంగా అధిక ధరలు మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని సాక్షాత్తు సెంట్రల్ బ్యాంకే అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం
వినియోగదారుల ధరల సూచీ బాస్కెట్‌లో దాదాపు సగం వాటా ఆహార ద్రవ్యోల్బణాది. గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు వంటి నిత్యావసర ఆహార పదార్థాల రేట్లు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఫైనల్‌గా రిటైల్ ఇన్‌ఫ్లేషన్ కూడా పెరిగింది.
ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 7.62 శాతంగా ఉంది. జులైలోని 6.69 శాతం నుంచి ఇది పెరిగింది. గతేడాది ఆగస్టు నెలలో ఇది కేవలం 3.11 శాతంగా ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే, రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది.
రుతుపవనాలు వెనక్కు మళ్లడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి, ఆహార ధరలు పెరగవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో, మండుతున్న ధరలను చల్లబరచడానికి ప్రభుత్వం గోధుమలు, చక్కెర, బియ్యం ఎగుమతులపై ఇప్పటికే ఆంక్షలు విధించింది.
అయితే, ఎగుమతుల మీద ఈ తరహా పరిమితులు విధించినప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగడం గమనార్హం.
ఇతర కమొడిటీస్ రేట్లు ఎలా ఉన్నాయి?
వార్షిక ప్రాతిపదికన లెక్కేస్తే... కూరగాయలు, మసాలాలు, పాదరక్షలు, ఇంధనం ధరలు 10 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
కూరగాయలు 13.23%, మసాలాల రేట్లు 14.9% పెరిగాయి. తృణధాన్యాలు, ఉత్పత్తుల్లో దాదాపు 10% పెరుగుదల కనిపించింది. దుస్తులు & పాదరక్షల ధరలు కూడా వేగంగా వృద్ధి చెందాయి.
అయితే, ఆగస్టు నెలలో గుడ్డు (Egg) రేటు దిగి వచ్చింది.
మళ్లీ వడ్డీ రేట్ల వడ్డింపు!
ఈ నెల ప్రారంభంలో ఒక సమావేశంలో మాట్లాడిన RBI గవర్నర్ శక్తికాంత దాస్; రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని, అంతర్జాతీయంగా ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు చల్లబడుతున్నాయి కాబట్టి వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి రిటైల్ ఇన్‌ఫ్లేషన్ దాదాపు 5 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేశారు.
ప్రస్తుతం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది మే నుంచి, బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను సెంట్రల్ బ్యాంక్ 140 బేసిస్ పాయింట్లు పెంచింది.
ద్రవ్యోల్బణం మళ్లీ 7 శాతానికి పెరగడంతో, తదుపరి పాలసీ సమావేశంలో (MPC) బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను మళ్లీ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఎన్ని బేసిస్ పాయింట్లు పెంపును ఎంచుకుంటుందో చూడాలి.
MPC తదుపరి సమావేశం ఈ నెల 30న ఉంటుంది. రెపో రేటును 25-50 బేసిస్ పాయింట్ల వరకు RBI పెంచుతుందని మార్కెట్‌లో అంచనాలున్నాయి.
పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
భారత పారిశ్రామికోత్పత్తి (IIP) వృద్ధి జులై నెలలో తగ్గింది, 2.4 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల కనిష్ఠ స్థాయి. మాన్యుఫాక్చరింగ్, పవర్, విద్యుత్, గనుల రంగాల్లో పెద్దగా వృద్ధి లేకపోవడం ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి 2.2 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 19.6 శాతం, జూన్‌లో 12.7 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం జులైలో 11.5 శాతం వృద్ధి కనిపించింది.