Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే, సామర్థ్యం తగ్గిపోయిందని పరీక్షల్లో వెల్లడి
Tungabhadra Project Gates | తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని, వాటి సామర్థ్యం సగానికి తగ్గిపోయిందని ఆల్ట్రా సౌండ్ పరీక్షల్లో వెల్లడైనట్లు తాజా అధ్యయనంలో తేలింది.

అమరావతి: తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయిందని, మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా అధ్యయనం నివేదికలో వెల్లడైంది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని తుంగభద్ర డ్యామ్ అన్ని గేట్లు మార్చాలంటే రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ, ఎ.కె.బజాజ్ కమిటీ సిఫార్సు మేరకు మొత్తం అన్ని గేట్లు, తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేశారు. ఇప్పటికే కొట్టుకుపోయిన 19వ నంబర్ గేటు మినహా మిగిలిన 32 గేట్ల సామర్థ్యంపై రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్, ఎంపీటీ, డీపీటీ పరీక్షల్లో నైపుణ్యమున్న కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అధ్యయనం చేసింది. సగానికి పైగా గేట్ల సామర్థ్యం తగ్గిపోయిదని, అన్ని గేట్లను మార్చాలని నివేదికలో తేల్చారు.
గత సెప్టెంబరులోనే బజాజ్ కమిటీ నివేదిక
తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని 33 గేట్లు మార్చాల్సిందేనని ఎ.కె.బజాజ్ కమిటీ గత సెప్టెంబరులోనే నివేదిక ఇవ్వడం తెలిసిందే. అందుకుగానూ ప్రభుత్వానికి దాదాపు 250 కోట్లు ఖర్చు అవుతుంది. సాధారణంగా జులై నాటికే ప్రాజెక్టులోకి ప్రవాహం పెరుగుతుంది. కేవలం మూడు నెలల సమయం ఉండటంతో, అప్పటిలోగా ఎంతమేర పనులు పూర్తి చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధ్యమైనంత త్వరగా స్పందించి, చర్యలు చేపడితే గేట్లు మార్చడం వీలవుతుంది. తద్వారా ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఏడాది తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ సాధ్యమవుతుందని చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న గేట్లతో తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయకూడదని నిపుణులు సూచించారు.
గత ఆగస్టులో కొట్టుకుపోయిన 19 నెంబర్ క్రస్ట్ గేటు
సాధారణంగా ప్రాజెక్టు గేట్ల లైఫ్ టైమ్ 45 ఏళ్లు. తుంగభద్ర డ్యాం నిర్మించి 70 ఏళ్లు అవుతుంది. గత ఏడాది ఆగస్టులో 19 నెంబర్ క్రస్ట్ గేటు కొట్టుకుపోగా, కన్నయ్య నాయుడు టీమ్ తాత్కాలికంగా స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి గండం గట్టెక్కించింది. అనంతరం ఎకే బజాజ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నియమించిన కమిటీ తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయనం చేసింది. గేట్లను దశలవారీగా అన్నింటిని మార్చాలని గతేడాది సూచించారు. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ సైతం ప్రాజెక్టును సందర్శించి, గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యం తేల్చాలని సిఫార్సు చేసింది. తమిళనాడుకు చెందిన సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చేసి, గేట్ల ఏర్పాటు సమయంలో వెల్డింగ్ చేసిన చోట పగుళ్లు వచ్చాయని, అలా వదిలేయకూడదని సమగ్ర అధ్యయనం చేయాలని సిఫార్సు చేసింది.
తుంగభద్ర డ్యాం 33 గేట్లలో 19 గేట్ల సామర్థ్యం 40- 55 శాతం మేర తగ్గిపోయిందని మెకానికల్ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కన్నయ్య నాయుడు తెలిపారు. ఆల్ట్రా సౌండ్ పరీక్షల ప్రకారం చూసినా గేట్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. గేట్ల సామర్థ్యం పెంచడంపై ఫోకస్ చేశాం. వచ్చే సీజన్ నీళ్లు ఇవ్వడంపై దృష్టిసారించినట్లు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

