(Source: ECI/ABP News/ABP Majha)
AP News: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై అధికారులకు ఏపీ సీఎస్ ఆదేశాలు
AP News: రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కెఎస్. జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
AP News: రాష్ట్రంలో ఉన్న ప్రమాదకర రసాయన పరిశ్రమలు నిబంధనలు పాటించకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ పరిశ్రమలపై సీఎస్ సీరియస్...
రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కెఎస్. జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం పై తీసుకున్నచర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాంటి పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో కూడిన బృందం ప్రతి ఏటా తప్పనిసరిగా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలని చెప్పారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఫైర్ సేప్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి వాటిని సరిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక విభాగ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పణంగా మారతాయి..
ఇటీవల కాలంలో వివిధ సాల్వెంట్ పరిశ్రమలు ఎక్కడపడితే అక్కడ కుటీర పరిశ్రమలు మాదిరిగా ఏర్పాటవుతున్నాయని వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్ధ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్సులు జారీ చేయాలని ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ ప్రమాదకర పరిశ్రల్లో ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ లను నిర్వహించాలని చెప్పారు.
పరిశ్రమల గుర్తింపు రద్దు చేస్తాం...
రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ డిసిఎస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 వేల వరకూ వివిధ ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 1500 వరకూ ప్రమాదకర ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇలాంటి పరిశ్రమల్లో ఏడాదికి ఒకసారి తనిఖీలు చేయడం జరుగుతుందని వివరించారు. మిగతా ఫ్యాక్టరీల్లో రేండేళ్ళకు ఒకసారి మరికొన్ని చిన్న పరిశ్రమల్లో మూడేళ్ళకు ఒకసారి వంతున తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాక్ డ్రిల్లు,స్పెషల్ డ్రైవ్ లు కూడా చేపడతామని, ప్రమాదాలు జరిగిన వెంటనే తనిఖీలు చేసి నివేదికలు సమర్పిస్తామన్నారు. పరిశ్రమలు తగిన నిబందనలు పాటించని పక్షంలో గుర్తింపు రద్దు చేసి క్రమినల్ కేసులు కూడ పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
బాయిలర్స్ పరిశ్రమలతో అలర్ట్..
డైకెర్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 3500 వరకూ బాయిలర్స్ ఉన్నాయని గుర్తించామని తెలిపారు. అందులో 2200 వరకూ రైస్ మిల్లుల్లోనే ఉన్నాయని చెప్పారు. గత ఐదేళ్ళ నుండి బాయిలర్స్ కు సంబంధించి ప్రమాదాలేమీ జరగలేదని వివరించారు. ప్రతి యేటా ఆయా బాయిలర్స్ వాటికి అనుసంధామై ఉన్న పైపులైన్లను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతోందని తెలిపారు.
రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ డి.మురళీ మోహన్ మాట్లాడుతూ.. నేషనల్ బిల్డింగ్ కోడ్ ను అనుసరించి పైర్ సేప్టీ లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రమాదకర పరిశ్రమల్లో ఏటా తనిఖీలు చేయడం జరుగుతుందని చెప్పారు.