Bangladesh: అణిచివేసినా నిలదొక్కుకుని, అవమానాలు ఎదుర్కొని - బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రస్థానమిదే
Muhammad Yunus: బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికైన మహమ్మద్ యూనస్ ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొని నిలబడ్డారు. షేక్ హసీనా ప్రభుత్వం ఆయనను అన్ని విధాలుగా వేధించింది.
![Bangladesh: అణిచివేసినా నిలదొక్కుకుని, అవమానాలు ఎదుర్కొని - బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రస్థానమిదే Who is Muhammad Yunus new pm of bangladesh interim government Bangladesh: అణిచివేసినా నిలదొక్కుకుని, అవమానాలు ఎదుర్కొని - బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రస్థానమిదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/07/b65ddde91525b06f3fa4410e7a66a4ba1723012642931517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశాక కొత్త ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎవరీ యూనస్ అనే చర్చ మొదలైంది. షేక్ హసీనా ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు చేస్తూ వస్తున్నారీ లీడర్. పైగా పేదలకు అండగా ఉన్న వ్యక్తిగానూ అక్కడ పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లను ఆపడం మొట్టమొదటి టాస్క్. ఆ తరవాత ఒక్కో సమస్యను చక్కదిద్దాల్సి ఉంటుంది. ఈ 83 ఏళ్ల మహమ్మద్ యూనస్ షేక్ హసీనాకి రాజకీయ ప్రత్యర్థిగా ఇప్పటికే ప్రజల్లో మద్దతు సంపాదించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. యూనస్‌ని షేక్ హసీనా రక్తపిశాచి అంటూ పలు సందర్భాల్లో తీవ్రంగా మండి పడ్డారు. ఇప్పుడు ఆమె రాజీనామా చేసిన వెంటనే యూనస్ "బంగ్లాదేశ్‌కి రెండోసారి స్వాతంత్య్రం వచ్చింది" అంటూ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు యూనస్.
బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రమ్‌కి చెందిన యూనస్...అమెరికాలోని వ్యాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి PhD చేశారు. ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని చాలానే ప్రయత్నించారు. ఓ చోట గ్రామీణ బ్యాంక్ స్థాపించేందుకు సహకరించి అక్కడి మహిళలకు ఉపాధి అందించడంలో కీలక పాత్ర పోషించారు. చిన్న మొత్తంలో రుణాలు అందించి గ్రామాల్లోని ప్రజల అభివృద్ధికి కృషి చేసినందుకు గానూ 2006లో మహమ్మద్ యూనస్‌ని నోబెల్ అవార్డ్ వరించింది. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నాక...ఆయన పేదరికంపై పోరాటం చేశారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కి బిల్‌గేట్స్ ఎలా అయితే నాంది పలికాడో..అదే విధంగా పేదరికాన్ని అంతం చేయడానికి మహమ్మద్ యూనస్ శ్రమించారంటూ అప్పట్లో ఆయనపై అంతర్జాతీయ కథనాలూ వెలువడ్డాయి. 1983లో గ్రామీణ బ్యాంక్‌లను స్థాపించిన యూనస్..పేదరికం నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఆ తరవాత రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారు. అప్పటి నుంచే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.
రాజకీయ ప్రత్యర్థులెవరూ ఉండకూడదన్న ఉద్దేశంతో షేక్ హసీనా ప్రభుత్వం ఆయనను విచారణల పేరుతో విసిగించింది. రుణాలు పొందిన వారిని వేధించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. ఆ తరవాత ఆయన బ్యాంక్ లావాదేవీలపైనా నిఘా పెట్టింది. ఆయన స్థాపించిన మిగతా సంస్థలపైనా ఇవే ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వైరం మరింత ముదిరింది. ఇప్పుడు ఉన్నట్టుండి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడం, మహమ్మద్ యూనస్ ఆపద్ధర్మ ప్రధాని కావడం అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామం. రాజకీయంగా తనను అణిచివేయాలన్న ఉద్దేశంతో ఎన్నో నిందలు మోపారని గతంలో చాలా సందర్భాల్లో ఆరోపించారు యూనస్. అందుకే ఆమె రాజీనామా చేసిన వెంటనే నియంత ప్రభుత్వం కుప్ప కూలింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. ఆమె వెళ్లిపోవడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. ఇప్పుడే కొత్తగా స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉందని స్పష్టం చేశారు యూనస్.
Also Read: Bangladesh: షేక్ హసీనాకి భారత్ ఎందుకు ఆశ్రయమివ్వడం లేదు? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)