Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
తనపై వైఎస్ జగన్ సన్నిహితుడు అనే ముద్ర పడటంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యాకే వైఎస్ జగన్ ను తొలిసారి కలిశానని బీజేపీ నేత స్పష్టం చేశారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు అనే ముద్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేంత వరకు తనకు ఆయనతో ఎలాంటి పరిచయాలు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అయితే ఎమ్మెల్సీగా ఉన్న తాను అప్పుడు సీఎంగా ఉన్న జగన్ ను కలిశానని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నుంచి అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును అధిష్టానం సోమవారం ప్రకటించింది.
జగన్ సన్నిహితుడైన బీజేపీ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని ఏపీలో ప్రచారం జరుగుతోంది. కూటమి నుంచి వస్తున్న వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. జగన్ సీఎం అయ్యేంత వరకు ఆయనతో తనకు పరిచయం లేదన్నారు. జగన్‍తో తనకు రహస్య స్నేహం అనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక ఎమ్మెల్సీగా ఉన్న తాను వెళ్లి కలిశానని తెలిపారు. తాను నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, జగన్ కు కేవలం 10 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు.
చంద్రబాబు 2014లో నాకు మంత్రి పదవి ఇస్తానన్నాను. మోదీ, చంద్రబాబు బంధంలానే.. చంద్రబాబుతో ఇద్దరి మధ్య నమ్మకమైన బంధం ఉందన్నారు. గతంలో తాను అమరావతిని వ్యతిరేకించానన్నది అవాస్తవం అన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది కేవలం బీజేపీ పార్టీ నిర్ణయం మాత్రమే నని, తాను ఎక్కడా, ఎలాంటి లాబీయింగ్ చేయలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో చిట్ చాట్ లో ఈ విషయాలు షేర్ చేసుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు..
ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబుకు ఛాన్స్ దక్కింది. టీడీపీ సైతం ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది. కావలి గ్రీష్మ (ఎస్సీ), బీటీ నాయుడు (బీసీ), బీద రవిచంద్ర (బీసీ)లకు అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే కూటమి నుంచి 5వ స్థానంపై ఉత్కంఠ నెలకొనగా చివరి నిమిషంలో సోము వీర్రాజును బీజేపీ ఎమ్మెల్సీ స్థానం ఖరారు చేసింది. దాంతో ఆయన హడావిడిగా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది.
ఆఘమేఘాల మీద నామినేషన్.. విమానంలో పత్రాలు, ఫారాలు
ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులకు బీ ఫారం పత్రాలు తప్పనిసరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన ఫారాలు అవసరం. తెలంగాణ నుంచి వాటిని టీవీఎస్ రాజు ప్రత్యేక విమానంలో గన్నవరం తీసుకెళ్లారు. వాటిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంతకాలు చేయాలి. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని ఆమె ఢిల్లీలో ఉన్నారు. దాంతో ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు స్పెషల్ ఆథరైజేషన్ ఇచ్చారు. ఏలూరు ధర్నాకు వెళ్తున్న ఆయన గన్నవరం వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రాలను తీసుకున్నారు.
పత్రాలు తీసుకుని అసెంబ్లీకు చేరుకున్నాక సోము వీర్రాజు ఆ పత్రాలు తీసుకుని మరో 14 నిమిషాల్లో గడువు ముగుస్తుందనగా.. నామినేషన్ దాఖలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

