Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Andhra Pradesh News | ఏపీలో ప్రత్యేక అవసరం ఉన్న పిల్లల కోసం స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఈ విషయం తెలిపారు.

AP Assembly Budget session: అమరావతి: స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నపుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50వేలు కూడా వసూలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ... స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని, వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటుచేసి, 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ (Special Education) ఇవ్వాలని నిర్ణయించింది. వీరి కోసం ఏపీలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్ కు ఇద్దరు ఐఇఆర్ ల చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారని’ తెలిపారు.
కమిటీ వేసి నిర్ణయాలు తీసుకుంటామన్న లోకేష్
కేంద్రబడ్జెట్ లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్ల కోసం ప్రతిపాదనలు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. వీటికి 100 శాతం నిధులు మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నాం. టీచర్ – స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రైమరీలో 1:10 (10 మంది విద్యార్థులకు ఒక టీచర్), సెకండరీలో 1: 15 (15 మంది విద్యార్థులకు ఒక టీచర్) ఉండాలి. సెకండరీలో ఇంకా రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉంది. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని’ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్.. నారా లోకేష్
రాబోయే మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తామని నారా లోకేష్ ఇటీవల చెప్పారు. టీచర్లు, పేరెంట్స్, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘అమరావతిలో టీచర్ ట్రైనింగ్ కు వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని భావిస్తున్నాం. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం వచ్చిన ట్రైనింగ్ తీసుకునేలా ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది జూన్ కల్లా సంస్కరణల అమలును పూర్తి చేస్తాం. నైతిక విలువలతో కూడిన విద్యకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఆధ్యాత్మకవేత్త చాగంటి కోటేశ్వరరావు నేతృత్వంలో నైతికత, విలువలు లాంటి అంశాలను సైతం పాఠాలలో జత చేర్చే యోచనలో ఉన్నాం. లింగ సమానత్వంతో పాటు మహిళలకు సమాజంలో గౌరవం, విలువల్ని పాఠ్యాంశాలుగా రూపొందిస్తున్నాం. వచ్చే నాలుగేళ్లు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్ పై శ్రద్ధ పెట్టి రాష్ట్రాన్ని మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే దిశగా పనిచేస్తున్నామని’ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.






















