Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Union Cabinet: ఢిల్లీ కాలుష్యాన్నితగ్గించేదుకు మెట్రోకు ప్రాధాన్యం ఇవ్వ కేంద్రం నిర్ణయించింది. ఫేజ్ 5Aకు అనుమతి ఇచ్చింది.

Delhi Metro expansion: కేంద్ర కేబినెట్ ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా అత్యంత కీలకమైన ఫేజ్ 5A ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దేశ రాజధానిలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత ఆధునీకరించేందుకు మరియు విస్తరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సుమారు 12,015 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఢిల్లీ మెట్రో ఫేజ్ 5A ప్రాజెక్టుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త దశలో భాగంగా ఢిల్లీ నెట్‌వర్క్‌కు అదనంగా 13 కొత్త స్టేషన్లు చేరనున్నాయి. ఇది నగరంలోని కీలక వాణిజ్య ,నివాస ప్రాంతాల మధ్య రవాణా కష్టాలను తీర్చనుంది.
ఫేజ్ 5A కింద ప్రధానంగా రెండు మార్గాలపై దృష్టి సారించారు. ఇందులో ఒకటి ఇందర్ లోక్ నుండి ఇంద్రప్రస్థ మధ్య నిర్మించే కారిడార్. ఈ మార్గం పూర్తయితే గ్రీన్ లైన్ , బ్లూ లైన్ మధ్య ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. అలాగే లాజ్‌పత్ నగర్ నుండి సాకేత్ జి-బ్లాక్ వరకు నిర్మించే మరో కారిడార్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కలుగుతుంది. ఈ విస్తరణ ద్వారా మెట్రో నెట్‌వర్క్ దాదాపు 20.33 కిలోమీటర్ల మేర పెరగనుంది. ఇందులో భూగర్భ , ఎలివేటెడ్ మార్గాలు రెండూ ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకు అయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా భరించనున్నాయి, దీనికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారం కూడా ఉంటుంది. ఈ 13 కొత్త స్టేషన్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రతిరోజూ అదనంగా సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తారని అంచనా. ఇది కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుంది.
#CabinetBriefing | Union Minister Ashwini Vaishnaw highlighted key milestones and future plans for the Delhi Metro during a Cabinet briefing:
— DD News (@DDNewslive) December 24, 2025
# Cabinet approval granted for a ₹12,015 crore Delhi Metro expansion project.
# Metro network expanded from 5 cities in 2014 to 26… pic.twitter.com/L2pUk27Hju
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. మెట్రో విస్తరణ వల్ల రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గి, తద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణ హితంగా ఈ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. రాబోయే 3 నుండి 4 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం గడువు విధించింది.
హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఇంకా ఎదురూచూపులే. రెండో దశ కోసం హైదరాబాద్ మెట్రో ఎదురు చూస్తోంది. పీపీపీ విధానంలో నిర్మించిన మెట్రోను ప్రభుత్వం నష్టాల కారణంగా స్వాధీనం చేసుకుంటోంది.





















