Bankrupt Pakistan: దివాలా స్థితిలో పాకిస్తాన్ - పాక్ ఎయిర్ లైన్స్ వేలం - ఎవరు కొన్నారంటే ?
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం తన విమానయాన సంస్థ పాక్ ఎయిర్ లైన్స్ ను అమ్మేసింది. అరీఫ్ హబీబ్ నే వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.

Pakistan Sells National Airline: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చే అప్పుల కోసం షరతులకు తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మేసింది.
పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్థాన్ తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి చిట్టచివరికి దేశ ప్రతిష్టకు చిహ్నంగా భావించే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను ప్రైవేటీకరించింది. ఇస్లామాబాద్‌లో జరిగిన బహిరంగ వేలంలో ప్రముఖ వ్యాపారవేత్త అరీఫ్ హబీబ్ నేతృత్వంలోని కన్సార్టియం పీఐఏను దక్కించుకుంది. ఐఎంఎఫ్ నుండి సుమారు 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పనిసరని విధించిన నిబంధన మేరకు పాక్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ వేలంలో అరీఫ్ హబీబ్ గ్రూప్ అత్యధికంగా 135 బిలియన్ పాకిస్థానీ రూపాయల అంటే సుమారు 482 మిలియన్ డాలర్లు బిడ్‌ను దాఖలు చేసి పీఐఏను గెలుచుకుంది. ఈ రేసులో లక్కీ సిమెంట్,ఎయిర్ బ్లూ' వంటి ప్రముఖ సంస్థలు పోటీ పడినప్పటికీ, అరీఫ్ హబీబ్ గ్రూప్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో విక్రయం ఖరారైంది. ప్రభుత్వం పీఐఏలోని 75 శాతం వాటాను విక్రయించగా, మిగిలిన 25 శాతం వాటాను తన వద్దే ఉంచుకుంది. అయితే నిర్వహణ బాధ్యతలు, పూర్తి నియంత్రణ ఇకపై ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయి.
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరున్న పీఐఏ, గత రెండు దశాబ్దాలుగా రాజకీయ జోక్యం, విపరీతమైన అవినీతి , నిర్వహణ లోపాలతో కుదేలైంది. సంస్థపై సుమారు 800 బిలియన్ రూపాయల భారీ అప్పులు పేరుకుపోయాయి. నకిలీ పైలట్ లైసెన్సుల కుంభకోణం కారణంగా అంతర్జాతీయంగా పీఐఏ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, యూరప్ , అమెరికా వంటి దేశాలు ఈ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో ప్రతి ఏటా వేల కోట్ల నష్టాలను భరించలేక, చివరకు ఐఎంఎఫ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం దీనిని విక్రయించక తప్పలేదు.
PIA privatized for just Rs. 132 billion. A national icon sold off like scrap
— Nasir Iqbal (@drniqbal) December 23, 2025
But this isn’t just a story of one airline’s downfall
It’s a case study in how Pakistan kills competition, rewards incompetence, and buries merit under political patronage.
From the world’s top… pic.twitter.com/Nhtwzv4hbH
ఈ డీల్‌లో భాగంగా కొత్త యాజమాన్యం రాబోయే ఐదేళ్లలో పీఐఏలో సుమారు 80 బిలియన్ రూపాయల అదనపు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. విమానాల ఆధునీకరణ, సేవల మెరుగుదల, అంతర్జాతీయ రూట్ల పునరుద్ధరణపై అరీఫ్ హబీబ్ గ్రూప్ దృష్టి సారించనుంది. ప్రభుత్వం తనకున్న భారీ అప్పుల్లో అధిక భాగాన్ని ఒక విడిగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేసి, పీఐఏను 'క్లీన్ డెబ్ట్' సంస్థగా బయ్యర్లకు అప్పగించింది. గత 20 ఏళ్లలో పాకిస్థాన్‌లో జరిగిన అతిపెద్ద ప్రైవేటీకరణగా ఈ డీల్ నిలిచిపోనుంది.





















