Thackeray brothers: చేతులు కలిపిన థాక్రే బ్రదర్స్ - శివసేనను మళ్లీ చేతుల్లోకి తెచ్చుకుంటారా?
BMC polls: థాకరే కుటుంబం నుంచి శివసేన జారిపోయాక ఇద్దరు బ్రదర్స్ కు కళ్లు తెరుచుకున్నాయి. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Thackeray brothers reunion for BMC polls: మహారాష్ట్ర రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న థాకరే సోదరులు ఉద్ధవ్ థాకరే (శివసేన UBT) , రాజ్ థాకరే (MNS) ఇప్పుడు ఒకే బాట పట్టడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2025లో జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలే లక్ష్యంగా వీరిద్దరూ చేతులు కలపడం ఇప్పుడు అధికార ఏకనాథ్ షిండే వర్గానికి , బీజేపీకి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా శివసేన పేరు, గుర్తు షిండే వర్గం చేతుల్లోకి వెళ్లిన తరవాత థాకరే వారసత్వాన్ని కాపాడుకోవడమే ఈ సోదరుల ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
శివసేనలో చీలిక తర్వాత ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కావడమే కాకుండా, పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అయితే, ముంబైలోని మరాఠీ ఓటర్లలో ఇప్పటికీ ఉద్ధవ్ థాకరే పట్ల కొంత సానుభూతి ఉంది. మరోవైపు రాజ్ థాకరేకు కూడా గ్రేటర్ ముంబై పరిధిలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఇద్దరూ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి షిండే-బీజేపీ కూటమికి లబ్ధి కలుగుతోందని గుర్తించిన సోదరులు, ఇప్పుడు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ కలిసి పోటీ చేస్తే ముంబైలోని కనీసం 70-80 వార్డుల్లో ఫలితాలను తలకిందులు చేయగలరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ కలయిక వెనుక ఉద్ధవ్ శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కృషి ఎంతో ఉంది. ఇటీవల ఆయన రాజ్ థాకరేతో సమావేశమై సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార వ్యూహాలపై చర్చించారు. ముంబై నగరంపై థాకరే ముద్ర మళ్లీ పడాలి, మన శత్రువు ఒక్కరే అనే నినాదంతో కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో వీరి మధ్య అవగాహన కుదిరింది. శివసేన ఇప్పటికే ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆవేదన ఇటు శివసైనికుల్లోనూ, అటు థాకరే కుటుంబంలోనూ ఉంది. అసలైన శివసేన ఎక్కడ ఉన్నా, అసలైన రక్తసంబంధం మా మధ్యే ఉంది అని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మరాఠీ భావోద్వేగాలతో బలం పుంజుకోవాలని వీరు భావిస్తున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఆశయాలను కాపాడేది తామేనని నిరూపించుకోవడానికి బీఎంసీ ఎన్నికలను వీరు ఒక వేదికగా మలుచుకుంటున్నారు.
థాకరే సోదరులు ఒక్కటైనా, ఉద్ధవ్ థాకరే ఇప్పటికే కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన 'మహా వికాస్ అఘాడి' (MVA)లో ఉన్నారు. రాజ్ థాకరే కూటమిలోకి వస్తే కాంగ్రెస్ తన వైఖరిని ఎలా మార్చుకుంటుందనేది పెద్ద ప్రశ్న. అయితే, ముంబై రాజకీయాల్లో ఉనికి చాటుకోవాలంటే సిద్ధాంతాల కంటే వ్యూహాలే ముఖ్యమని వీరు భావిస్తున్నారు. ఒకవేళ బీఎంసీలో థాకరే సోదరుల కూటమి సక్సెస్ అయితే, అది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది కానుంది. ముంబైని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న ఏకనాథ్ షిండేకు, థాకరే సోదరుల ఈ ఐక్యత గట్టి అడ్డుగోడగా మారే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.





















