Danam Nagender: కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: దానం నాగేందర్
BRS Defected MLAs | తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు.

Danam Nagender Reaffirms Congress Loyalty | హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేందర్, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. ఎమ్మెల్యేగా నెగ్గాక కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ గుర్తుమీద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిసిందే.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యం
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను కృషి చేస్తానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం (MIM) పార్టీల తరపున ప్రచారం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపనున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా..
దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత పిటిషన్లను ఇటీవల కొట్టివేయడం తెలిసిందే. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిసెంబర్ నెలలోనే కొట్టివేశారు.
1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దానం నాగేందర్ గెలుపొందారు. 2009, 2018, 2023 ఎన్నికల్లో్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.






















