H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
H1B visa New Rules:అమెరికాలో హెచ్-1బీ వీసాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులు , అమెరికన్ టెక్ కంపెనీలకు పెను సమస్యలు సృష్టించనున్నాయి.

H1B visa lottery scrapped: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను ప్రకటించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కంప్యూటర్ ఆధారిత లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో వేతనాల ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రతి వీసాపై లక్ష డాలర్ల అదనపు రుసుము విధించడం భారతీయ టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానం వల్ల తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుని అమెరికన్ల ఉద్యోగాలను కొట్టేస్తున్నారని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. అందుకే, ఫిబ్రవరి 27, 2026 నుండి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. గరిష్ట వేతనం ఆఫర్ చేసే దరఖాస్తుదారులకు నాలుగు ఎంట్రీలు, తక్కువ వేతనం ఉన్నవారికి తక్కువ ప్రాధాన్యత లభిస్తాయి. దీనివల్ల నూతన గ్రాడ్యుయేట్ల కంటే అనుభవజ్ఞులైన, అధిక వేతనం పొందే నిపుణులకే వీసా లభించే అవకాశాలు 107 శాతం పెరుగుతాయి. ఇది ప్రారంభ దశలో ఉన్న భారతీయ ఇంజనీర్లకు పెద్ద అడ్డంకిగా మారనుంది.
తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, కొత్తగా హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసే కంపెనీలు ఒక్కో వీసాకు 1,00,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 91 లక్షల రూపాయలు. ఈ నిబంధన సెప్టెంబర్ 2025 నుండే అమలులోకి వచ్చింది. ఒకప్పుడు కొన్ని వేల డాలర్లతో పూర్తయ్యే ఈ ప్రక్రియ, ఇప్పుడు కోట్లతో కూడుకున్నది కావడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల నుండి చిన్న స్టార్టప్‌ల వరకు అందరిపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.
.@DHSgov is publishing a final new rule for the H-1B work visa program to better protect American workers and wages. For too long, the H-1B program has failed to meet Congress’ intent.
— USCIS (@USCIS) December 23, 2025
Learn more: https://t.co/gHK64EAALO pic.twitter.com/3pIIvOyrPz
మరోవైపు, వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్న కొత్త రూల్స్ కారణంగా వీసా ఇంటర్వ్యూలు భారీగా ఆలస్యమవుతున్నాయి. గతంలో నెల రోజుల్లో పూర్తయ్యే ఈ ప్రక్రియ, ఇప్పుడు 2026 అక్టోబర్ వరకు వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళుతోంది. ఈ అనిశ్చితి వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ హెచ్-1బీ ఉద్యోగులను దేశం విడిచి వెళ్లవద్దని, ఒకవేళ బయట ఉంటే వెంటనే తిరిగి రావాలని అంతర్గత మెయిల్‌లు పంపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
హెచ్-1బీ వీసాల జారీలో సుమారు 70 శాతం పైగా వాటా భారతీయులదే. తాజా నిబంధనలతో అమెరికాలో ఉద్యోగం సంపాదించడం ఖరీదైన వ్యవహారంగా మారడమే కాకుండా, కొత్తగా వచ్చే వారికి అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు, ఈ ఆంక్షల వల్ల అమెరికాలోని నైపుణ్యం కలిగిన భారతీయులు కెనడా, యూరప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అమెరికాలోని 20 రాష్ట్రాలు కోర్టులో దావాలు వేశారు. ఈ చట్టపరమైన పోరాటంపైనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.





















