Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. లేడీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉన్నా డ్రగ్స్ విక్రయిస్తుందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత, తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుయేల్‌తో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరూ కలిసి యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు.
నలుగురి అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం
సమాచారం అందుకున్న పోలీసులు చిక్కడపల్లి పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. తమ తనిఖీల్లో భాగంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుష్మిత, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయేల్‌తో పాటు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సింథటిక్ డ్రగ్స్‌గా పిలిచే MDMA, LSD బోల్ట్స్, ఖరీదైన OG కుష్ (గంజాయి రకం) ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాల విలువ 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇమాన్యుయేల్ కొండాపూర్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన ప్రేమ జంట సుస్మిత, ఇమాన్యుయేల్ కొంతకాలం నుంచి డ్రగ్స్ విక్రయిస్తోంది. డ్రగ్ పెడ్లర్ సాయికుమార్‌తో కలిసి ఈ జంట నగరంలో మత్తు పదార్థాలను విక్రయిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
డ్రగ్స్ సంస్కృతిపై పోలీసుల నిఘా
ఐటీ నిపుణులు, విద్యార్థులు ఈ రకమైన మత్తు పదార్థాల వైపు మళ్లుతుండటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు, వీరి నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా టెక్నాలజీని వాడుకుంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.






















