Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Legal Father: చట్టబద్దమైన పెళ్లి బంధంలో ఉన్నప్పుడు వివాహేతర బంధం ద్వారా పుట్టినా ఆ పిల్లవాడి తండ్రి ఆ మహిళ భర్తే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
![Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ? Presumption is husband is father of child born in valid marriage SC rejects plea for DNA test Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/fb735d85d42d5d7710e8ce19aed7332317380804373511021_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Presumption is husband is father of child born in valid marriage: భార్య, భర్తలు చట్టబద్దమైన బంధంలో ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు వారే అవుతారు. తల్లి విషయంలో ఎలాంటి సందేహం ఉండుద. నవమాసాలు మోసి కంటుంది. తండ్రి ఎవరు అనే దానిపై అసలు నిజం ఆమెకే తెలియాలి. చట్టబద్దమైన బంధంలో ఉన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు తండ్రి పేరును నమోదు చేశారు. అక్కడ ఎలాంటి సందేహం రాదు. కానీ కొన్ని కొన్ని అరుదైన కేసుల్లో తన బిడ్డకు తండ్రి తన భర్త కాదని వాదిస్తూ ఉంటారు. అలాంటి కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
చట్టబద్ధమైన వివాహబంధంలో పుట్టిన బిడ్డకు తండ్రి భర్తే
చట్టబద్దమైన వివాహ బంధంలో భార్యభర్తలు ఉన్నప్పుడు పుట్టిన బిడ్డను ఆ జంట చట్టబద్ధమైన సంతానం అని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఒక మహిళ తన కుమారుడి నిజమైన తండ్రి ఎవరో తేల్చేందుకు DNA పరీక్షను కోరుతూ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తులు సూర్యకాంత్ , ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
తన బిడ్డ తన భర్తకు పుట్టలేదని .. తండ్రి పేరు మార్చాలని ఓ మహిళ పిటిషన్
కేరళకు చెందిన ఓ మహిళ 1991లో వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు జన్మించాడు. కొచ్చిన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించే జనన రిజిస్టర్‌లో ఆమె భర్త పేరు బాలుడి "తండ్రి"గా నమోదు చేశారు. అయితే వారి మధ్య విభేదాల కారణంగా 2003లో ఈ జంట విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికే వారు విడాకుల కోసం ఉమ్మడి దరఖాస్తును దాఖలు చేశారు. 2006లో కుటుంబ కోర్టు మంజూరు చేసింది.
విడాకులు మంజురు అయిన తర్వాత ఆమె మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించి జనన రిజిస్టర్‌లో మరొక వ్యక్తి పేరును "తండ్రి"గా నమోదు చేయమని అధికారులను కోరింది. తన బిడ్డకు అసలైన తండ్రి అతనేనని అతనితో వివాహేతర బంధం ద్వారా బిడ్డను కన్నానని చెప్పింది. అయితే అలా తండ్రి పేరు మార్చడానికి సాధ్యం కాదని.. కోర్టు ఆదేశిస్తేనే అలా చేయగలమని కార్పొరేషన్ తెలిపింది. దాంతో ఆమె కోర్టులను ఆశ్రయించారు.
డీఎన్‌ఏ టెస్టులకూ అంగీకరించని సుప్రీంకోర్టు
చివరికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అవసరం అయితే తన కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించి.. తండ్రి ఎవరో తేల్చాలని ఆమె కోరింది. అయితే ఆమె చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, చట్టబద్ధత, పితృత్వం అనేవి వేర్వేరు భావనలు అని తెలిపింది. భారతీయ సాక్ష్యాల చట్టం, 1872లోని సెక్షన్ 112 ప్రకారం చట్టబద్ధత పితృత్వాన్ని నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో అధికారికంగా తండ్రి పేరు మాజీ భర్త పేరే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)