Pakistan Election 2024: హంగ్ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్ ఓటర్లు, ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ
Pakistan Election 2024: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pakistan Election Results 2024: పాకిస్థాన్ ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ కట్టబెట్టకుండా అక్కడి రాజకీయాల్ని మరింత ఉత్కంఠగా మార్చారు. అటు నవాజ్ షరీఫ్, ఇటు ఇమ్రాన్ ఖాన్ ఎవరికి వాళ్లే తమదే విజయం అంటూ ప్రకటించినప్పటికీ ఫలితాలు మాత్రం అలా రాలేదు. ఫలితంగా..అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా నిలబడిన స్వతంత్ర అభ్యర్థులు భారీగానే గెలిచినప్పటికీ వాళ్లు ఏ పార్టీలోకి వెళ్తారన్నదే కీలకంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ 113 కు దూరంలో ప్రధాని పార్టీలు ఆగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు సత్తా చాటారు. 92 మంది ఇమ్రాన్ మద్దతు దారుల విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ.. 63 స్థానాలు దక్కించుకుంది. బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పాక్ పీపుల్స్ పార్టీకి 50 స్థానాలు దక్కాయి. ఇంకా ఫలితాలు అధికారికంగా వెలువడకపోయినా...ఒక పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదని అక్కడి మీడియా చెబుతోంది. ఈ క్రమంలోనే Pakistan Muslim League-Nawaz (PML-N) చీఫ్ నవాజ్ షరీఫ్ Pakistan Peoples Party (PPP) కో ఛైర్మన్ అసిల్ అలీ జర్దారీతో భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, PPP నేతలతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిముషాల పాటు ఈ భేటీ జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. త్వరలోనే ఓ ఒప్పందానికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నికలైనా, ప్రజాస్వామ్యమైనా ప్రజలకు సేవ చేయడానికే. ప్రస్తుతం దేశానికి స్థిరమైన ప్రభుత్వం చాలా అవసరం. నియంతృత్వం నుంచి బయటపడాలి. గాయపడిన పాకిస్థాన్‌కి ఓ ఆపన్నహస్తం కావాలి. ఎన్నికలంటే కేవలం గెలుపు ఓటములే కాదు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం. వాళ్ల మద్దతుని పొందడం. వ్యక్తిగత స్వార్థాలు విడిచిపెట్టి ప్రజల గురించి ఆలోచించే నేతలు కావాలి. దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి"
- పాకిస్థాన్ ఆర్మీ చీఫ్