Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ 2024 - CGA నివేదికలో కీలక విషయాలు
Budget 2024: కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో సీజీఏ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023, డిసెంబర్ చివరి నాటికి ఆర్థిక లోటు రూ.9.82 లక్షల కోట్లుగా ఉంది.
Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి, పారిశ్రామిక వర్గాలకు మేలు చేకూరేలా నిర్ణయాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) బుధవారం విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023 డిసెంబర్ చివరి నాటికి ఆర్థిక లోటు రూ.9.82 లక్షల కోట్లుగా ఉంది. ఇది వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 55 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే టైంకి ద్రవ్యలోటు 2022 - 23 బడ్జెట్ అంచనాలో 59.8 శాతంగా ఉంది. 2023-24 నాటికి ప్రభుత్వ ఆర్థిక లోటు రూ. 17.86 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 5.9 శాతంగా ఉందని అంచనా.
ఆదాయం వివరాలు
డిసెంబర్ 2023 నాటికి ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ. 20.71 లక్షల కోట్లు (సంబంధిత BE 2023-24లో 76.3 శాతం)గా ఉంది. ఇందులో రూ. 17.29 లక్షల కోట్ల పన్ను ఆదాయం (నికర), రూ. 3.12 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం, రూ.29,650 కోట్ల రుణేతర మూలధన వసూళ్లు ఉన్నాయి. డిసెంబర్ 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాగా రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.7.47 లక్షల కోట్లు బదిలీ చేసిందని, ఇది గత ఏడాది కంటే రూ.1,37,851 కోట్లు ఎక్కువని కాగ్ నెలవారీ ఖాతా నివేదికలో వెల్లడైంది. కేంద్రం చేసిన మొత్తం వ్యయం రూ.30.54 లక్షల కోట్లు (2023-24లో 67.8 శాతం), ఇందులో రెవెన్యూ ఖాతాలో రూ.23.80 లక్షల కోట్లు, రూ. 6.73 లక్షల కోట్లు మూలధన ఖాతాలో ఉన్నాయి. మొత్తం రెవెన్యూ వ్యయంలో రూ.7,48,207 కోట్లు వడ్డీ చెల్లింపులు, రూ.2,76,804 కోట్లు ప్రధాన రాయితీల రూపంలో ఉన్నాయి.
2023 ఏప్రిల్ - డిసెంబర్‌లో నమోదైన రూ.9.9 లక్షల కోట్లతో పోలిస్తే ప్రభుత్వ ఆర్థిక లోటు స్వల్పంగా తగ్గిందని ICRA చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. నికర పన్ను రాబడులు 11 శాతం పెరిగాయి. ఆర్బీఐ డివిడెండ్‌తో పన్నుయేతర రాబడులు 46 శాతం పెరిగ్గా.. ఆదాయ వ్యయంలో స్వల్పంగా 2 శాతం వృద్ధి కనిపించింది. '2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17.9 లక్షల కోట్ల ఆర్థిక లోటు లక్ష్యం ఉల్లంఘించబడుతుందని అనుకోవడం లేదు. అయితే, కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న దానికంటే నామమాత్రపు GDP తక్కువగా ఉండటం వల్ల GDPలో 6 శాతం ద్రవ్య లోటుకు దారితీయవచ్చు' అని నాయర్ అన్నారు. ఆర్థిక ఏకీకరణ మార్గాన్ని కొనసాగిస్తూ, 2025-26 నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.5 శాతానికి దిగువకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2024 - 25 ఆర్థిక లోటు వివరాలను, కేంద్రం మార్కెట్ రుణాలు తీసుకునే కార్యక్రమంతో పాటుగా వివరిస్తారని భావిస్తున్నారు.
Also Read: GST Collection: బడ్జెట్ ముందే ప్రభుత్వానికి శుభవార్త, భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు